ఇంటికి దీపం ఇల్లాలే! ఆమె ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటుంది. వంట పనిలో.. ఇంటి పనిలో.. పిల్లల పోషణను క్రమపద్ధతిలో నిర్వర్తిస్తూ ఇంటిని చక్కదిద్దుతుంది. కానీ, ఆమెకు చిన్నపాటి సుస్తి చేస్తే కుటుంబమే కాకావికలమవుతుంది. ఈ నేపథ్యంలోనే మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర సర్కారు, మహిళా దినోత్సవం సందర్భంగా మరో గొప్ప వరాన్ని అందించబోతున్నది. నేడు కరీంనగర్ వేదికగా ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుడుతున్నది. ప్రతి మంగళవారం ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల్లో 57 రకాల టెస్టులు ఉచితంగా చేయనున్నది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం కరీంనగర్లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తెచ్చిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని బుట్టిరాజారాం కాలనీ యూపీహెచ్‌సీలో ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానలో మహిళల కోసం ప్రత్యేకంగా 65 పడకల వార్డు, మెరుగైన పరీక్షల కోసం రేడియాలజీ యూనిట్, అనుబంధ ఎంసీహెచ్‌లో మరో వంద పడకల వార్డును కూడా ప్రారంభించనున్నారు. 23.75కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత చైతన్య డిగ్రీ కాలేజీలో విద్యార్థినులకు కార్డియాక్ హెల్త్ స్కీనింగ్ పరీక్షలను ప్రారంభించి, మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంలో పాల్గొననున్నారు.
– పెద్దపల్లి, మార్చి 7(నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ విద్యానగర్, మార్చి 7
విద్యానగర్, మార్చి 7 : రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మహిళలను ఆరోగ్యపరంగా మరింత శక్తివంతంగా తయారుచేసేందుకు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అమలు చేయనున్నది. కరీంనగర్ వేదికగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉదయం 10.15 గంటలకు బుట్టి రాజారాం కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 11 గంటలకు ప్రభుత్వ దవాఖానలోని ఎంసీహెచ్‌లో 100 పడకల వార్డు, రేడియాలజీ హబ్, ఆరోగ్య మహిళ వార్డు ప్రారంభంతోపాటు క్రిటికల్ కేర్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తా రు. 11.30కు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. 12 గంటలకు చైతన్య డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు కార్డియాక్ హెల్త్ స్కీనింగ్ పరీక్షలను ప్రారంభిస్తారు. 12.30 గంటలకు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్క్‌ఫెడ్‌లో నిర్వహించనున్న వేడుకల్లో పా ల్గొంటారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించి, వివరించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 15 క్లినిక్‌లు
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 100 పీహెచ్‌సీల్లో ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 క్లీనిక్‌లను ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలోని మూడు పీహెచ్‌సీలను ఎంపిక చేశారు. చొప్పదండి, చల్లూరు పీహెచ్‌సీలు, కరీంనగర్‌లోని బుట్టిరాజారాం కాలనీలోని యూపీహెచ్‌సీలో సేవలను ప్రారంభిస్తారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, నేరేళ్ల, వేములవాడ పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ యూపీహెచ్సీ.. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం గద్దలపల్ల్లి పీహెచ్సీ, పెద్దపల్లి, రామగుండం యూపీహెచ్‌సీలు.. జగిత్యాల జిల్లాలోని కొడిమ్యా ల, ధర్మపురి మండలం నేరేళ్ల, అయిలాపూర్, కథలాపూర్ పీహెచ్‌సీలు, జగిత్యాల యూపీహెచ్‌సీలో బుధవారం సేవలను ప్రారంభిస్తారు. ఉచితంగా పరీక్షలు చేయడంతోపాటు మందులు కూడా అందిస్తారు. నేటి నుంచి ప్రతి మంగళవారం నాన్‌స్టాప్‌గా నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలందరికీ వైద్యసేవలు అందనున్నాయి.
ప్రతి మంగళవారం పరీక్షలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 దవాఖానల్లో మహిళా క్లీనిక్‌లు నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం మహిళలకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. మందులు ఉచితంగా ఇస్తారు. అవసరమైతే ఇతర దవాఖానలకు రెఫర్ చేస్తారు. పరీక్షల అనంతరం ఆరోగ్య మహిళ యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. ప్రతి పేషంట్‌కు తన ఆరోగ్య పరిస్థితి, వైద్యం వివరాలతో కూడిన కేస్ షీట్ ఇస్తారు. పరీక్షలు పూర్తయ్యాక మెరుగైన వైద్యసేవలు అవసరమని భావిస్తే ఇతర దవాఖానలకు రిఫర్ చేస్తారు. అక్కడ వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తారు.
57 రకాల పరీక్షలు ఉచితం
మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా రుగ్మతలను గుర్తించేందుకు ప్రతి మంగళవారం వైద్యపరీక్షలు నిర్వహించడానికి కసరత్తు చేస్తుంది. దీని కోసమే ‘ఆరోగ్య మహిళ’ అనే పథకాన్ని తీసుకువస్తున్నది. ఇందులో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి, మందులు, అవసరమైన వారికి చికిత్స కూడా చేయనున్నారు. ప్రధానంగా డయాగ్నోస్టిక్స్, సూక్ష్మపోషక లోపాలు, పీసీవోఎస్, కుటుంబనియంత్రణ, రుతు సమస్యలు, లైంగిక వ్యాధులు, క్యాన్సర్ స్క్రీనింగ్, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మెనోపాజ్ నిర్వహణ, శరీర బరువుకు సంబంధించిన పరీక్షలు చేయనున్నారు. 24 గంటల్లోనే రిపోర్ట్లు అందిస్తారు.
మహిళలకు షుగర్, బీపీ, రక్తహీనత వంటి వాటికి సాధారణ పరీక్షలతో పాటు లక్షణాల మేరకు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఇంకా వెయిట్ మేనేజ్మెంట్, సెక్స్‌వల్ ట్రాన్స్మిటెడ్ మే నేజ్మెంట్, ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్, మోనోపాజ్, థైరా యిడ్, విటమిన్‌డీ-3, ఈ-12 డెఫిసియన్సి వంటి వాటికి దవాఖానల్లో స్క్రీనింగ్ చేస్తారు. దాంతో పాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ప్లమేటరీ వ్యాధులకు కూడా పరీక్షలు చేయనున్నారు. అసవరమైన వారిని రెఫరల్ ఆసుపత్రులకు పంపించనున్నారు. హర్మోన్ రీప్లేస్మెంట్, థెరపీ మెడికేషన్, కౌన్సెలింగ్ ఇస్తారు. బరువుకు సంబంధించి యోగ, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారు.
ఎంసీహెచ్‌లో మరో వంద పడకలు ప్రారంభం..
ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలిచిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఇప్పటికే 150 పడకలతో ప్రసూతి సేవలు అందిస్తున్నారు. నిష్ణాతులైన వైద్యులతో మెరుగైన సేవలు అందిస్తుండడంతో ప్రసూతికి వచ్చే గర్భిణుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో పడకలు దొరకని పరిస్థితి నెలకొంటున్నది. మంత్రి గంగుల విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, మరో 100 పడకలు అదనంగా మంజూరు చేశారు. రూ.6.25కోట్లతో ప్రస్తుతమున్న భవనంపై మూడో అంతస్తును సకల సౌకర్యాలతో నిర్మించారు. దీనిని మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ ప్రారంభించనున్నారు.
మహిళల కోసం 65పడకలతో వార్డు..
వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు రూ.3.14కోట్లతో పెద్ద దవాఖాన రెండో అంతస్తులో కొత్తగా 65 పడకలతో వార్డు నిర్మించారు. సకల సౌకర్యాలు కల్పించి ప్రారంభోత్సవానికి ముస్తాబు చేశారు.
క్రిటికల్ కేర్ యూనిట్‌కు శంకుస్థాపన
ఉమ్మడి జిల్లాలో నాణ్యమైన ఉచిత వైద్య సేవలకు నిలయంగా మారిన ప్రభుత్వ దవాఖానలో ప్రస్తుతం సాధారణ రోగాలకు, ప్రాణాపాయం లేని రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. అయితే, రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాల బారిన పడ్డవారిని ఎంజీఎం, హైదరాబాద్‌కు తరలించాల్సి వస్తోంది. ఈక్రమంలో మంత్రి గంగుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ 50 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేశారు. రూ.23.75 కోట్లు మంజూరు చేయగా, ఎంసీహెచ్ వెనుకభాగంలో 50 పడకలతో జీప్లస్‌టూ పద్ధతిలో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్నారు.
మెరుగైన పరీక్షల కోసం రేడియాలజీ హబ్
కరీంనగర్ ప్రధాన దవాఖానలో అత్యాధునిక పరికరాలతో రెడియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.80 లక్షలు మంజూరు చేయగా, భవనాన్ని నిర్మించారు. ఇందులో ఎక్స్‌రే, స్కానింగ్, కంప్యూటర్ మోనోగ్రామ్, ఈసీజీ, 2డీ ఎకో సౌకర్యాలు కల్పించారు. త్వరలోనే సీటీ స్కాన్‌తో పాటు ఎంఆర్ఐ యంత్రాలు కూడా అందుబాటులోకి తేనుండగా, ఈ సెంటర్‌కు నేడు ప్రారంభోత్సవం చేయనున్నారు.
మెరుగైన సేవలతో విశేష ఆదరణ
ప్రభుత్వ దవాఖానలు సరికొత్తగా మారాయి. స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పించింది. మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడం, నాణ్యమైన మందులు అందిస్తుండడంతోనే ప్రజాదరణ పెరుగుతున్నది. అనతికాలంలోనే రోగుల సంఖ్య రెట్టింపయింది. ఈ క్రమంలోనే అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నది. రేడియాలజీ విభాగం, మహిళల కోసం ప్రత్యేకంగా 65 పడకల వార్డును సిద్ధంచేశాం. నేడు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశాం.
– డాక్టర్ రత్నమాల, మెడికల్ సూపరెంటెండెంట్, ప్రభుత్వ దవాఖాన (కరీంనగర్)
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని బుధవారం సిరిసిల్ల జిల్లాలోని నాలుగు పీహెచ్‌సీల్లో ప్రారంభిస్తున్నాం. ప్రతి మంగళవారం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని తంగళ్లపల్లి, నేరెల్ల, సుందరయ్యనగర్(సిరిసిల్ల), వేములవాడ దవాఖానల్లో సేవలను ప్రారంభిస్తున్నాం. 57 రకాల పరీక్షలు ఫ్రీగా చేయడంతోపాటు మందులు కూడా అందిస్తాం. ప్రభుత్వం ఎంతో ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సుమన్‌మోహన్‌రావు, డీఎంహెచ్‌వో (రాజన్న సిరిసిల్ల జిల్లా)