జగిత్యాల : జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 36 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన 35.96 కిలోల గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ దహనం (Ganja Burnt) చేసిందని ఎస్పీ అశోక్ కుమార్ ( SP Ashok Kumar ) తెలిపారు. ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ లోని నియమ ,నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని దహనం చేశామన్నారు.
అక్రమార్జనలో భాగంగా, గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎవరైనా గంజాయి , ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రఘు చందర్, రాములు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు రవి, కరుణాకర్, ఆర్ఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.