Double bedroom houses | పెద్దపల్లి, జూన్ 12(నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పేదలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని రాంపల్లి, చందపల్లిల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సామూహిక కాలనీలను శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలు రాజకీయాలకతీతంగా పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం నిలుస్తుందని, ప్రజలతో సత్సంబంధాలు ఉంటూ సంక్షేమం కోసం కృషి చేసే నాయకుడు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాత్రమేనన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.22 వేల 500 కోట్లతో మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందని, రాబోయే 3 సంవత్సరాలలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాజకీయాలకతీతంగా నిరు పేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చే చేశామని, రాబోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు.
కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు మార్చకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మౌలిక వసతులు కల్పించి అందిస్తున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 1000 ఇండ్లు బఫర్ క్రింద అదనంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్ కు సూచించారు.
మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు సాగునీరు అందుతుందంటే పెద్దపల్లి ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని అన్నారు. అర్హత ఉండి ఇండ్లు రానివారు ఎవరు ఆందోళన చెందవద్దని, రాబోయే దశలలో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. 2023 ఎన్నికల కంటే ముందే 450 మంది లబ్ధిదారులను డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నిర్ణయించామని, అక్కడ మౌలిక సదుపాయాలు లేని కారణంగా గత 18 నెలల కాలంగా లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లలేకపోయారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద డిఎంఎఫ్టి, అమృత్ పథకాల కింద నిధులను వినియోగించుకొని అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు.
రామగుండం పట్టణంలో కూడా 650 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ కోసం సిద్ధంగా ఉన్నాయని, అక్కడ మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయని మరో రెండు నెలల కాలంలో వాటిని పూర్తి చేసి మంత్రి సమయం తీసుకొని పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ.. రూ. 4.5 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్లను ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లను వారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ టీ. భానుప్రసాదరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్, డిసిపి కరుణాకర్, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, జే. అరుణశ్రీ, ఆర్డీఓ బొద్దుల గంగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూపతో పాటు ప్రజా ప్రతినిదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.