రామవరం, జనవరి 11 : సిరుల మాగాణి సింగరేణి.. పర్యావరణ రహిత చర్యల్లో భాగంగా వ్యాపార విస్తరణను దృష్టిలో పెట్టుకొని సోలార్ ప్లాంట్లను నెలకొల్పుతున్నది. థర్మల్తో పాటు సోలార్ రంగంలోకి అడుగుపెట్టిన ఘనత దేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీకే దక్కింది. ఇందులో భాగంగా రూ.143.36 కోట్లతో కొత్తగూడెం ఏరియాలో 37 మెగావాట్ల ప్లాంట్ను నిర్మించింది. సీఎండీ ఎన్ శ్రీధర్ నెలవారీ సమీక్షలు నిర్వహిస్తూ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో గత సెప్టెంబర్ 22న డైరెక్టర్ (పా) ఎన్ బలరాం, డైరెక్టర్ (ఈఅండ్ఎం) డీ సత్యనారాయణరావు, జీఎం నర్సింహారావు ప్రారంభించారు. అక్టోబర్ 13 నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. రోజుకు 1,77,600 యూనిట్ల ఉత్పత్తితో ఏరియాకు లాభాలు తెచ్చిపెడుతున్నది. ఏరియా నెలకు రూ.కోటి, ఏడాది రూ.12కోట్ల ఆదాయం సమకూర్చుకోనున్నది.
ప్రాజెక్టు వ్యయం రూ.143.36 కోట్లు..
కొత్తగూడెం ఏరియాలో 195 ఎకరాల్లో రూ.143.36 కోట్లతో 37 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. 1 యూనిట్ విద్యుదుత్పత్తికి రూ.6 ఖర్చు అవుతుండగా, ఉత్పత్తి చార్జీలు రూ.4 పోగా రూ.2 ఆదాయం వస్తుంది. ప్రాజెక్టు కాల పరిమితి 25 ఏండ్లు. 12 ఏండ్లు పెట్టుబడి పోనూ మరో 12 ఏండ్ల తర్వాత పెట్టుబడి పెట్టిన మొత్తం తిరిగి వస్తుంది.
ప్లాంట్ నిర్మాణం..
ఒక మెగావాట్ ప్లాంట్ నిర్మించేందుకు 5 ఎకరాల స్థలంలో 2,900 సోలార్ ప్లేట్లు నిర్మిస్తారు. ఇక్కడ మొత్తం 37 మెగావాట్లకు గాను 5 ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టారు. జూనియర్ బాలికల కళాశాల హాస్టల్ పక్కన 25.89 ఎకరాల్లో 6.25 మెగావాట్లు, ఏరియా బంగ్లోస్ ముందు భాగంలో 61.58 ఎకరాల్లో 10.35 మెగావాట్లు, గరిమళ్లపాడులో 71 ఎకరాల్లో 15.130 మెగావాట్లు, పెనుబల్లిలో 36 ఎకారాల్లో 4.925 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటుచేశారు.
సోలార్ విద్యుదుత్పత్తిలో ఏరియా ముందుంటుంది..
ఈ సోలార్ ప్లాంట్ ద్వారా వేసవిలో 1,77,600, చలి, వర్షాకాలాల్లో సుమారు రోజుకు 1,67,000 యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. అలాగే భవిష్యత్ కోసం మరో 3వ దశలో 33 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేయనున్నది. ఏరియాలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా 10.5 మెగావాట్లు, గరిమళ్లపాడు రైల్వేట్రాక్ వద్ద 22.5 మెగావాట్లు, మిగతాది స్థల పరిశీలనలో ఉన్నది. 2023 జూన్, జూలై నాటికి పనులు పూర్తిచేసుకొని ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దీని నిర్మాణం పూర్తయితే సింగరేణి వ్యాప్తంగా సోలార్ విద్యుదుత్పత్తిలో కొత్తగూడెం ఏరియా 70 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రథమ స్థానంలో నిలస్తుంది. – ఎర్రగుడి రఘురాంరెడ్డి, ఏరియా ఇంజినీర్