Singareni workers | గోదావరిఖని : సింగరేణి సంస్థ 2024 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలపై 34% వాటా రూ. 819 కోట్లు కార్మికులకు చెల్లిస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోమవారం ప్రకటించారు. హైదరాబాద్ ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి లాభాలకు సంబంధించి ప్రకటన చేస్తూ కార్మికులకు వాటాను ప్రకటించారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.6394 కోట్ల లాభాలను అర్జించిందని ఇందులో సంస్థ అభివృద్ధి కోసం రూ. 4034 కోట్లు పక్కనపెట్టిన అనంతరం సింగరేణి లాభం రూ.2360 కోట్లుగా ఉందని పేర్కొంటూ దీనిపై కార్మికులకు 34% వాటాగా రూ.819 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో పర్మనెంట్ కార్మికులకు రూ.802.5 కోట్లు కాంట్రాక్ట్ కార్మికులకు రూ.6.30 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. పర్మినెంట్ కార్మికులకు సరాసరిగా రూ.లక్ష 95 వేలు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ గా లభిస్తాయి అని పేర్కొన్నారు.
మరోసారి లాభాల వాటా పై మోసం చేసిన కాంగ్రెస్ : టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి
సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించే విషయంలో రెండవసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలపై కార్మికులకు వాటా చెల్లించాల్సి ఉండగా అందుకు భిన్నంగా సంస్థ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులను పక్కనపెట్టి నామమాత్రం లాభాలను చూపించి కార్మికులను మోసం చేసింది. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి కార్మికుల కష్టంతో రూపాయలు 6394 కోట్లు లాభాలు సాధిస్తే అందులో రూ. 4034 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టడం కార్మికులను మోసం చేయడమే.. కేవలం 2360 కోట్లు లాభాలుగా పేర్కొంటూ అందులో 34% వాటా ఇస్తున్నట్లు పేర్కొనడం కార్మికులను దారుణంగా మోసం చేయడమే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ రూ.4701 కోట్లు లాభాలు అర్జిస్తే అందులో సంస్థ అభివృద్ధి కోసమని రూ.2289 కోట్లు పక్కనపెట్టి కేవలం రూ.2412 కోట్ల లాభాలపై 33% వాటాగా చెల్లించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఏనాడు కూడా సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం అని ఎలాంటి నిధులను పక్కన పెట్టలేదని సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలపై మాత్రమే వాటాను చెల్లిస్తూ వచ్చింది. కార్మికులకు వాటా పెంచినట్లు ఒక వైపు చెబుతూ మరోవైపు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఈ మోసంపై కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు రానున్న రోజుల్లో నికర లాభాలపై 34 శాతం వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో దశల వారి ఆందోళనలను చేపడతాం.