Prajavani | కరీంనగర్ కలెక్టరేట్, మే 26 : సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపాలంటూ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు బాధితులు అధికారుల ఎదుట మోకరిల్లారు. ఏండ్లు గడుస్తున్న తాము ఎదుర్కొంటున్న సమస్యలకు ముగింపు లభించటం లేదంటూ, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలాలు ఉంటలేవంటూ మొరపెట్టుకున్నారు.
వారి సమస్యలను సావధానంగా విన్న అదనపు కలెక్టర్, ఇతర అధికారులు త్వరగా పరిష్కార మార్గం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆర్జీదారులు అందజేసిన ధరఖాస్తులు స్వీకరించి, ఆయా విభాగాల అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలపై ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, వారి బాధలు ఆలకించి, వారి ఇబ్బందులు తీర్చేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మొత్తం దరఖాస్తులు 337
వీటిలో అత్యధికంగా నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలతో నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 57 ధరఖాస్తులు వచ్చాయి. భూ సంబంధిత సమస్యలపై జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై 150 దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అప్పగిస్తూ, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ చాహెత్ బాజ్పాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కే మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ తో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.