కొత్తపల్లి, అక్టోబర్ 30: నగరంలోని ‘కొండా సత్యలక్ష్మి’ గార్డెన్లో శ్రీ నిధి చిట్‌ఫండ్ సౌజన్యంతో, జిల్లా చదరంగ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్‌కు వివిధ జిల్లాల నుంచి సుమారు 120 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను శ్రీనిధి చిట్‌ఫండ్ డైరెక్టర్లు కోమల్‌రెడ్డి, రమణారెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజర్, చెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గడ్డాల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని, చెస్‌తో మేథో సంపత్తి పెరుగుతుందన్నారు. చెస్‌లో రాణించిన వారు విద్యలో ప్రతిభ చాటి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, ఓపెన్ కేటగిరిలో 12 ప్రైజ్‌లతో పాటు నగదు బహుమతులు, అండర్-9, 11, 15 కేటగిరీల్లో బహుమతులు అందజేయనున్నట్లు చెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కంకటి కనకయ్య, చెస్ కోచ్ కంకటి అనూప్ తెలిపారు. కార్యక్రమంలో కొండా శ్రీనివాస్, సీనియర్ చెస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.