తెలంగాణ చౌక్‌లో వేంకటేశ్వరుడి కటౌట్‌ను కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం
ఇందిరాగాంధీ విగ్రహం కనిపించదంటూ వింత వాదన
పనులు అడ్డుకునేందుకు యత్నించిన కొంత మంది నాయకులు
పోలీసుల జోక్యంతో వెనక్కి
‘హస్తం’ నేతల తీరుపై విమర్శలు
మండిపడుతున్న నగర వాసులు
కరీంనగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నది. మూడేళ్ల నుంచి ఏడాదికోసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు విశేష స్పందన వస్తుండగా.. ఇది జీర్ణించుకోలేక తెరవెనుక కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తున్నది. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి ఉత్సవాలను నిర్వహించేందుకు ఇప్పటి నుంచే చేస్తున్న ఏర్పాట్లకు అడ్డు తగులుతున్నది. తెలంగాణచౌక్‌లో వేంకటేశ్వరుడి కటౌట్ ఏర్పాటు కోసం చేస్తున్న పనులను కొందరు నాయకులు బుధవారం అడ్డుకునేందుకు యత్నించడం కుటిల బుద్ధిని బయటపెడుతున్నది. వెంకన్న కటౌట్ ఏర్పాటు చేస్తే ఇందిరాగాంధీ విగ్రహం కనిపించదంటూ వింత వాదన చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. పోలీసుల జోక్యంతో సదరు నాయకులు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుండగా.. ‘హస్తం’ నేతల తీరుపై నగరవాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ నడిబొడ్డున నిత్య పూజలం దుకుంటున్న వేంకటేశ్వరుడి దేవస్థానానికి 154 ఏండ్ల చరిత్ర ఉన్నది. ఏకశిలపై వెలసిన ఈ వెంకన్నకు ఎంతో ప్రాశస్థ్యం ఉన్నది. బ్రహ్మాండ నాయకుడికి ముచ్చటగా నాలుగోసారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయా న్ని ఈ నెల 25వ తేదీన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించిన విషయం తెలిసిందే. నిజానికి 2018 ఫిబ్రవరిలో ఆనాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో తొలిసారిగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. మొదటిసారే అత్యంత వైభవంగా నిర్వహించడంతో విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే 2019 ఫిబ్రవరిలో రెండో సారి నిర్వహించారు. కరీంనగర్ నుంచే కాకుండా చుట్టుపక్క జిల్లాల నుంచి సైతం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శోభాయాత్రకు ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపించారు. ఉత్సవాలను బ్ర హ్మాండంగా నిర్వహించిన తీరును చూసి సాక్షాత్తూ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అభినందించారు. 2020 జనవరిలో మూడోసారి ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం నాలుగోసారి అత్యంత బ్రహ్మాండంగా నిర్వహించేందుకు దేవాలయ అధికారులు సిద్ధమయ్యారు. దేవస్థానం అధికారులతోపాటు మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో హోర్డింగ్‌లు, చౌరస్తాల్లో లైటింగ్లు, దేవాలయం పరిధిలో పచ్చతోరణాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేసేందుకు పనులు మొదలు పెట్టారు. అందులో భాగంగానే తెలంగాణచౌక్, బస్టాండ్ చౌరస్తాలో వేంకటేశ్వర స్వామి, శ్రీరామ పట్టాభిషేక కటౌట్లను విద్యుద్దీపాల అలంకరణతో ఏర్పాటు చేసేందుకు పనులు మొదలు పెట్టారు. నిజానికి ఉత్సవాల్లో భాగంగా ఏటా తెలంగాణచౌక్‌లో ఏర్పాటు చేసే వెంకన్న కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఆ దారి వెంట రాత్రిపూట వచ్చిపోయే భక్తులు, అక్కడే ఆగి క టౌట్ను కనులారా తిలకించి వెళ్తున్నారు.
‘హస్తం’ రాజకీయం?
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నగరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ చౌక్ వద్ద వేంకటేశ్వరుడి భారీ కటౌట్ ఏర్పా టు చేయనున్నారు. రెండు రోజులుగా అందుకు సంబంధించిన పనులు చేస్తున్నారు. నిజానికి మరోసారి బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించే అవకాశం రాబోతున్నదని నగరవాసులు సంతోష పడుతున్నారు. కానీ, కొంత మంది కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ ఉత్సవాలకు రాజకీయరంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి బుధవారం జరిగిన సంఘటనే సాక్ష్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ చౌక్‌లో వేంకటేశ్వరుడి కట్ట్ను ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న పనులను బుధవారం కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. పనులు నిలిపివేయాలని వాదనకు దిగారు. ఎందుకని ప్రశ్నిస్తే.. కటౌట్ ఏర్పాటు చేస్తే ఇందిరాగాంధీ విగ్రహం కనిపించకుండా పోతుందని వింత వాదనకు దిగారు. బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులపాటే జరుగుతాయని, ఆ కొద్ది రో జులు మాత్రమే కటౌట్ ఉంటుందని, అంతేకాకుండా మిగిలిన మూడు వైపుల నుంచి విగ్రహం కనిపిస్తుందని ఆలయ అధికారులు సర్ది చెప్పా రు. అంతేకాదు, ఇందిరాగాంధీ విగ్రహం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తామని చెప్పినా.. ఆ నేతలు మొండికేశారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆపాల్సిందేనంటూ పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు తెలంగాణచౌక్కు చేరుకొని సర్దిచెప్పారు. వాస్తవాలను గుర్తించాలని సూచించారు. పోలీసుల జోక్యంతో నాయకులు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నా.. ఏదో కోణంలో అడ్డుకునేందుకు తెర వెనుక కుట్రలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ అడ్డుకునే ప్రయత్నా ల వెనుక ఆ పార్టీకి చెందిన కొందరు పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నే తల తీరుపై నగరవాసులు మండి పడుతున్నారు. ఇందిరాగాంధీ విగ్రహం విషయంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటూనే బ్రహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తుంటే.. ఇంత అక్కసు గక్కడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి వెళ్లలేని లక్షలాది మంది భక్తులు.. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించి తరించిపోతున్న సమయంలో అడ్డుపడడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ఈ ఉత్సవాలకు రాజకీయ రంగు పులుమకుండా.. భక్తి కోణంలో చూడాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.