వికసిస్తున్న విద్యా కుసుమాలు
అన్నింటా రాణిస్తున్న వేములవాడ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు
పలువురికి ప్రభుత్వ, ప్రైవేటు కొలువులు
కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలు సాధించిన మహారాణులు
వేములవాడ, నవంబర్ 29;అట్టడుగు వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గురుకులాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు సర్కారు కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని అన్నింటా రాణిస్తూ జీవితంలో స్థిరపడుతున్నారు. వేములవాడ పట్టణంలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు కొందరు ప్రభుత్వ, ప్రైవేటు కొలువులు సాధించగా మరికొందరు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి లక్షల్లో జీతం తీసుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను, సకల సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు రాణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. తాపీ మేస్త్రీ బిడ్డ పోలీస్ కానిస్టేబుల్‌గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది.గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీదే ఆధారపడి జీవించే రైతు బిడ్డలు కార్పొరేట్ ఉద్యోగాల్లో కొలువుదీరుతున్నారు. అక్షరాల ఏడాదికి లక్షల జీతం తీసుకుంటూ కొలువుల్లో మహారాణుల్లా కొలువుదీరారు. వేములవాడ పట్టణంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా డిగ్రీకళాశాలలో డిగ్రీ పూర్తిచేసి పట్టాతో పాటు ఉద్యోగం పొందిన మహిళలపై అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఎఫ్‌హెచ్‌పీఎల్ కంపెనీలో బండి శ్రావణి..
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన సంపత్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె బండి శ్రావణి వేములవాడ పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఎంఎస్టీ సీఎస్ డిగ్రీని 2018-21 సంవత్సరంలో పూర్తిచేసింది. 10వ తరగతి, ఇంటర్ పెద్దపల్లి, కరీంనగర్లో చదివిన శ్రావణి డిగ్రీని మాత్రం గురుకుల కళాశాలలో చదివింది. చదువు పూర్తవగానే ఉద్యోగాన్ని కూడా పొందింది. ప్రస్తుతం శ్రావణి ఫ్యామిలీ హెల్త్‌ప్లాన్ ఇన్సూరెన్స్ కంపెనీలో డాటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉద్యోగం చేస్తున్నది. ఏడాదికి రూ.2.20లక్షల జీతంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది.
ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న గిన్న అమూల్య
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన గిన్నె వెంకటరమణ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా ఆయన కుమార్తె గిన్నె అమూల్య వేములవాడ పట్టణంలోని గురుకుల మహిళ డిగ్రీకళాశాలలో ఎంఎస్‌టి సీఎస్ డిగ్రీని 2018-2021 సంవత్సరంలో పూర్తిచేసింది. పదో తరగతి వరకు కోరుట్ల, ఇంటర్ కరీంనగర్లో చదివిన అమూల్య డిగ్రీని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ కళాశాలలో పూర్తి చేసి పట్టాతో పాటు ఉద్యోగాన్ని పొందింది. బెంగుళూరు కేంద్రంగా ఉన్న ‘వూవ్లీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ’లో డాటా అనలిస్ట్‌గా ఉద్యోగం సాధించింది. ఏడాదికి రూ.4లక్షల వేతనంతో ఇటీవలే ఉద్యోగంలో చేరింది. ఈ సందర్భంగా రాష్ట్ర గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌రాస్ కూడా ఆమెను అభినందించారు.
కరీంనగర్‌కు చెందిన పొనుగోటి శ్రీనివాస్ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆయన రెండో కుమార్తె విజూష మొదటి నుంచి గురుకుల పాఠశాలలో చదివింది. 10వ తరగతి వరకు చింతకుంట గురుకుల పాఠశాలలో చదివి ఇంటర్ కూడా అక్కడే పూర్తి చేసింది. డిగ్రీలో వేములవాడలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలోని ఎంఎస్టీ సీఎస్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. డిగ్రీ రెండో సంవత్సరంలోనే కళాశాల అనుమతి తీసుకొని కానిస్టేబుల్ ఉద్యోగం కోసం రాతపరీక్షకు హాజరైంది. 2017-2020 సంవత్సరంలో డిగ్రీ పూర్తవగానే పట్టాతో పాటు ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగాన్ని సాధించింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన విజూషను అప్పటి కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కూడా అభినందించారు. ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్‌గా కరీంనగర్లో ఆమె విధులు నిర్వహిస్తున్నది. తాను ఎస్ఐ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజూష తెలిపింది.
కాగ్నిజెంట్‌లో తగటికె సౌందర్య
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన స్వామిది రైతు కుటుంబం. స్వామి రెండో కూతురు గటికె సౌందర్య వేములవాడలోని గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో ఎంఎస్‌టి సీఎస్ డిగ్రీని 2017-2020లో పూర్తి చేసింది. గురుకుల కళాశాల తరుపున వికారాబాద్‌లో ఇచ్చిన డాటా సైన్స్‌లోనూ ఆమె ప్రావీణ్యం పొంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కాగ్నిజెంట్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. 10వ తరగతి వరకు ధర్మపురిలోనే చదువుకున్న సౌందర్య ఇంటర్ కరీంనగర్లో పూర్తి చేసింది. డిగ్రీని మాత్రం గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో పూర్తిచేసి వెంటనే సాలీనా రూ. 4లక్షల వేతనంతో ఉద్యోగాన్ని పొందింది. ప్రస్తుతం ఇంటి నుంచే ఆమె ఉద్యోగం చేస్తున్నది.