హుజూరాబాద్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకూ కాళేశ్వర జలాలు
ఉద్యమ సమయంలోనే మాట ఇచ్చి నిలుపుకున్న ముఖ్యమంత్రి
కరీంనగర్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హుజూరాబాద్ నియోజకవర్గం వ్యవసాయాధారిత ప్రాంతం. సమైక్యరాష్ట్రంలో కాలువలున్నా.. నీళ్లే వచ్చేవి కావు. బావులున్నా.. కరెంటు కోతలతో ఇబ్బందులు.. వెరసి అన్నదాత బతుకు ఆగం. ఆయకట్టు చివరి గ్రామాల పరిస్థితి అగమ్య గోచరం. నీటికోసం యుద్ధాలు.. ఆపై కేసులు.. జైళ్ల పాలు.. వీటన్నింటినీ నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2001 నుంచి 2003 మధ్యలో ఈప్రాంతంలో జరిగిన సభలు, సమావేశాల్లో ప్రస్తావించారు. స్వరాష్ట్రం సాధించి బీళ్లు వారిన పొలాలు, దుమ్మురేగిన కాలువలు, గ్రామాల మధ్య నీటియుద్ధాలు లేకుండా చేసి.. పొలాల పొంట జలసవ్వడులు వినిపించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆనాడు చెప్పింది అక్షరాలా చేసి చూపించారు. ఇప్పుడు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా కాళేశ్వర జలాలు పొలాలపొన్న పరుగులు పెడుతున్నాయి. కరెంటు కష్టాలు పోయాయి. నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కావడం వల్లే తమ కష్టాలు కన్నీళ్లు దూరమయ్యాయంటున్నారు ఈ నియోజకవర్గ ప్రాంత రైతులు.
2001లో జమ్మికుంట మైదానంలో, 2003లో హుజూరాబాద్‌లోని హైస్కూల్ గ్రౌండ్లో వివిధ సందర్భాలను పురస్కరించుకొని జరిగిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అప్పటికే ఈప్రాంతాన్ని అవసాన పోసిన కేసీఆర్.. ఆనాడే టీఆర్ఎస్ రాష్ట్ర నేతగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ప్రొఫెసర్ బియ్యాల జనార్ధన్‌రావు ద్వారా హుజూరాబాద్ ప్రాంత ప్రజల కష్టాలపై చర్చించారు. హుజూరాబాద్ వస్తున్న దారిలో ఎండిపోయిన పొలాలు, నీరు లేని కాల్వల గురించి కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడారు. “లచ్చన్న గీ కాల్వలు ఎన్నడు బాగు పడాల్నే.. మనం ఉద్యమంలో గీ నీళ్ల గురించే ఎక్కువగా దృష్టి పెట్టాలి’ అని వాఖ్యానించారు. ఈ గడ్డపై జరిగిన అనేక సభల్లో ఈ అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాల్వ చివరి ఆయకట్టు రైతు కూడా తనకు నీరు రాలేదనే పరిస్థితి లేకుండా కాల్వలను బాగు చేసుకుందామని, సాగునీటి కొరత లేకుండా చూసుకుందామని ఆనాటి రైతాంగానికి హామీ ఇచ్చారు. తదనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గంలోని కమలాపూర్, జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ఆ తర్వాత క్రమంలో చీమలు పెట్టిన పుట్టలోకి పాము చొరపడ్డట్లుగా 2004లో ఈటల రాజేందర్ ప్రవేశించాడు. ఆయన ఈ కాలువలపై ఏనాడూ ఊసెత్తిన పాపాన పోలేదు.
ఆనాటి సాగునీటి పరిస్థితి..
హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, వీణవంక, శంకరపట్నం మండలాల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువకు దిగువ భాగంలో ఉంటాయి. ఎవరు చూసినా కాలువ కింది ఊళ్లు వాళ్లకేంది అనుకునే పరిస్థితి ఉండేది. అయితే మహారాష్ట్రలో వర్షాలు పడితే ఏడాదికో, రెండేళ్లకో ఓ సారి ప్రాజెక్టు నిండేది. ఆ నీటిని కాలువకు వదిలితే ఇక్కడికి వచ్చేసరికి సగం కూడా మిగిలేవి కాదు. అందులో కరీంనగర్, వరంగల్ నగరాల తాగునీటి అవసరాలకు కూడా ఈ నీరే ప్రధాన వనరుగా ఉండేది. దీంతో కేవలం కాలువ కింద ఉన్న భూముల రైతులకు మాత్రమే నీరు అందేది. ఆయా డిస్ట్రిబ్యూటరీ చివరన ఉండే గ్రామాల రైతులకు నిరాశే మిగిలేది. ప్రతి సంవత్సరం సాగునీరు కోసం ధర్నాలు, రాస్తారోకోలు, కాలువల ధ్వంసాలు పరిపాటిగా మారేది. వీణవంక మండలంలో హిమ్మత్‌నగర్, కొండపాక, పోతిరెడ్డిపల్లి, జమ్మికుంట మండలంలోని వావిలాల, నగురం, నాగారం, తనుగుల, ఇల్లందకుంట మండలంలో పాతర్లపల్లి, సీతంపేట, శాయంపేట, లక్ష్మాజిపల్లి, కమలాపూర్ మండలంలో శనిగరం, మాధన్నపేట, గూనిపర్తి వంటి గ్రామాల్లో నీటి యుద్ధాలే నిత్యం కనిపించేవి. రైతులు చందాలు వేసుకొని అప్పటి ఎస్సారెస్పీ సిబ్బందికి లంచాల రూపేణా ఇచ్చి ప్రధాన కాలువ తూముల వద్ద రాత్రులు పండుకొని మరీ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. బావులు తవ్వుకుంటే కరంటు ఉండకపోయేది, ఏ తిప్పల పడ్డా సగం పంట కూడా చేతికొచ్చే పరిస్థితి ఉండేది కాదు. అప్పటి రైతులు కమలాపూర్, ఉప్పల్ చెరువులను నింపుకొనేందుకు ఏకంగా ప్రధాన కాలువకే బాంబులు అమర్చి నీళ్లు తీసుకునే సాహాసం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ మండలాల్లో అనేక మంది ఎస్సారెస్పీ అధికారులు పెట్టిన కేసుల్లో ఇరుక్కుని నెలల పాటు జైళ్లలో ఉండి వచ్చిన సందర్భాలున్నాయి. వేసిన పంటలు చేతికి రాక అనేక మంది బలవన్మరణం పొందారు.
ప్రస్తుతం గుంట ఎండిన చరిత్ర లేదు..
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆయన ముఖ్యమంత్రి కాగానే కాకతీయ కాలువపై ప్రధాన దృష్టి సారించారు. రూ.వేయి కోట్లు వెచ్చించి కాకతీయ కాలువ మరమ్మతులు చేసి సామర్థ్యం పెంచారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లను, ఇతర పిల్ల కాలువలను సరిచేశారు. ఇదే సమయంలో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని కాలువలను, చెరువులను అనుసంధానం చేశారు. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరందుతోంది. గుంట భూమి కూడా ఎండకుండా నీరు పారుతున్నది.
కాలువల మీద పండుకునేది..
అప్పుడు కాకతీయ కాలువ నీళ్ల కోసం కందుగుల దాంకా వెళ్లి రాత్రి పూట తూము తీసి అక్కడ్నే పండుకునేటోళ్లం. రైతులందరం మనిషిన్ని పైసలేసుకొని సిబ్బందికి ఇచ్చేటోళ్లం. అయినా వేరే ఊరు రైతులొచ్చి లొల్లిచేసుటోళ్లు. కొన్ని సార్లు కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా పంట చేతికొచ్చుడు అనుమానంగానే ఉండేది. ఇప్పుడు ఒక్క గుంట కూడా ఎండిపోకుండా నీళ్లు మా ఊరు దాకా వస్తున్నయి. అప్పటి రోజులు భయంకరంగా ఉండే.