హుజూరాబాద్/ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 29: హుజూరాబాద్ ఉప పోరుకకుసర్వం సిద్ధం చేశామని, కొవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఉదయం 7గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా పోలింగ్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఓటు వేయడానికి రావాలని సూచించారు. ప్రతి బూత్‌లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందని చెప్పారు. శుక్రవారం ఆయన హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు. అనంతరం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు కందుగుల జడ్పీహెచ్‌ఎస్‌లోని మూడు పోలింగ్ కేంద్రాలను, ధర్మరాజుపల్లి, పెద్దపాపయ్యపల్లి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి సభలు సమావేశాలు, ప్రెస్మీట్లు నిర్వహించడానికి వీల్లేదని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిని, అలాగే ఓటు వేసేందుకు డబ్బులు అడిగే వారిపై కూడా కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే స్థానికేతరులు 4 వేల మందిని గుర్తించి నియోజకవర్గం నుంచి పంపించామని తెలిపారు. ఉప ఎన్నిక నిర్వహణకుగాను సిబ్బంది హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారని చెప్పారు.
మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, అలాగే సోలార్ లాంప్లు, చార్జింగ్ లైట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఓటర్లందరికీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని, ఓటర్ స్లిప్ గుర్తింపు కార్డు కాదని, దీంతో పాటు ఆధార్‌కార్డు, బ్యాంక్ పాసుబుక్, ఎన్నికల గుర్తింపు కార్డుతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదేని ఒకటి వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లు సెల్ఫోన్లు వెంట తీసుకువస్తే నేరమని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 10 మంది చొప్పున ఫ్లయింగ్ స్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు సమర్థవంతంగా పని పనిచేస్తున్నాయని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని, దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లందరూ ఓటు హకు వినియోగించుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. కరోనా రోగులు పీపీఈ కిట్లు ధరించి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఓటు హకును వినియోగించుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, తహసీల్దార్ రాంరెడ్డి, టౌన్ సీఐ వీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
స్వేచ్ఛాయుతంగా ఓటేయాలి: సీపీ సత్యనారాయణ
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, కేంద్ర పోలీస్ బలగాలను కూడా వినియోగిస్తున్నామని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఎంసీసీ కింద ఇప్పటికే 130 కేసులు బుక్ చేశామని, రూ.3.5 కోట్లు నగదు సీజ్ చేశామని పేర్కొన్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజల సమాచారం అందిస్తే 10 నిమిషాల్లో అకడికి చేరుకొని ప్రలోభాలకు గురి చేసే వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. నకిలీ ఫిర్యాదులు ఇచ్చే వారిపై కూడా కేసులు బుక్ చేస్తామని తెలిపారు. డబ్బులు ఇవ్వడం, అడగడం రెండు కూడా నేరమేనన్నారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం సమాప్తమైందని, స్థానికేతరులు ఎవరు కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉండకూడదన్నారు. ఇప్పటికే స్థానికేతరులు 4 వేల మందిని గుర్తించి నియోజకవర్గం నుంచి పంపించామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో సుమారు 107 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అక్కడ అదనంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గట్టి నిఘా పెట్టామని తెలిపారు.
కరోనా పేషెంట్లకు ప్రత్యేక ఏర్పాట్లు: ఆర్డీవో రవీందర్‌రెడ్డి
కరోనా పేషెంట్లు ఓటేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆర్డీవో రవీందర్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం 6గంటల తర్వాత ఓటు వినియోగించుకోవడానికి రావాలని, అక్కడ ఉన్న వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు అందిస్తారని వాటిని ధరించి ఓటు వేయాలని సూచించారు. దివ్యాంగులు, 80ఏళ్ల పైబడిన వృద్ధులు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండానే ఓటును వినియోగించుకోవచ్చునని చెప్పారు. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టింగ్‌లు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, ఇతరత్రా సమస్యల స్వీకరణకు కలెక్టరేట్, హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని, 100కు కూడా డయల్ చేయవచ్చునని చెప్పారు. సింగాపూర్‌లో వచ్చిన ఫిర్యాదు అంతా ఉత్తదేనని స్పష్టం చేశారు.