ఓటమి భయంతో కుట్రలు, కుతంత్రాలు
దళితబంధును ఆపేందుకు లేఖ రాయడం నీచం
ఓట్ల కోసం మా కాలనీలకు మళ్ల ఎట్ల వస్తడు?
మా వాడల్లో అడుగుపెట్టనీయం
ఎన్ని కుట్రలు పన్నినా పథకం ఆగదు
నీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తం
రాజేందర్‌కు హుజూరాబాద్ నియోజకవర్గ దళితుల హెచ్చరిక
అగ్గి రాజేసిన రాజేందర్ రాసిన లేఖ
వల్బాపూర్, వీణవంకలో ధర్నాలు
మామిడాలపల్లిలో లేఖలు చింపేసి నిరసన
టీఆర్ఎస్తోనే ఉంటామని, ‘గెల్లు’ను గెలిపిస్తామని వెల్లడి
కరీంనగర్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/వీణవంక : దళితబంధును నిలిపేయాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ దళితవాడల్లో అగ్గి రాజేస్తున్నది. తమ బతుకుల బాగు కోసం సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నాడని దళిత జాతి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ నోటికాడి బుక్కను ఎత్తగొడుతున్నాడంటూ మండిపడ్డది. బుధవారం వీణవంక మండల కేంద్రంతోపాటు వల్భాపూర్, మామిడాలపల్లిలో దళితబిడ్డలు రోడ్లెక్కి నిరసనకు దిగారు. ఈటల రాసిన లేఖల ప్రతులను చించి నేలకు కొట్టారు. తాము బాగుపడడం ఈటలకు ఇష్టం లేదని, దళితుల ఓట్లు తనకు పడవనే ఉద్దేశంతోనే నీచమైన పనులు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. మళ్ల దళితవాడలకు ఎలా వస్తాడని, మా కాలనీల్లో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. తమ బతుకు కోరుతున్న కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై దళితుల్లో ఆగ్రహజ్వాల వ్యక్తమవుతున్నది. దళితబంధు నిలిపి వేయాలని ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖ దళిత కాలనీల్లో అగ్గిరాజేస్తున్నది. తమ బతుకుల్లో వెలుగులు నింపేందుకు దేశంలోనే ఏ నాయకుడు చేయని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెడితే రాజేందర్ కల్లు మండించుకుంటున్నారని, ఈ పథకాన్ని ఆపేందుకు కుట్రలు పన్నులుతున్నాడని దళితులు ధ్వజమెత్తుతున్నారు. ఈసీకి లేఖ రాసినట్లు తెలుసుకున్న దళితులు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండల కేంద్రంలో దళితులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అంతకు ముందు ఇదే మండలంలోని వల్బాపూర్‌లో కరీంనగర్, జమ్మికుంట రహదారిపై దళితులు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. మామిడాలపల్లిలోని ఎస్సీ కాలనీలో దళితులు ఈటల రాజేందర్ ఈసీకి రాసిన లేఖ ప్రతులను చించి నేలకేసి కొట్టారు. ఆయన కుట్రలు పన్నేందుకు మేమే దొరికామా..? అని దళితులు తమ బాధను వ్యక్తం చేశారు. ఓటమి భయంతో ఈటల రాజేందర్ దళిత బంధు పథకాన్ని నిలిపి వేసేందుకు కుట్రలు పన్నుతున్నాడని విరుచుకుపడుతున్నారు. ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్ని రోజులు తమ బతుకులను ఏ పార్టీ, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, తరతరాలుగా మా బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెడితే ఈటల రాజేందర్ తమకు కాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడని ఆగ్రహించారు. దళిత బంధు పథకాన్ని వ్యతిరేకించి రేపు మా కాలనీలకు ఓట్లు అడిగేందుకు ఎలా వస్తావని ప్రశ్నించారు. మేము లేకుండా నీవు ఏ ఉద్యమాలు చేశావని ఈటలను నిలదీశారు. అన్ని ఉద్యమాల్లో ముందున్న మా బతుకులు మార్చడానికి సీఎం కేసీఆర్ గొప్ప పథకాన్ని ఇస్తే వ్యతిరేకిస్తావా..? అని ఈటలపై ధ్వజమెత్తారు.
గెల్లునే గెలిపించుకుంటాం
తమ బతుకు కోరుతున్న టీఆర్ఎస్ వెంటే ఉంటామని, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని దళితులు స్పష్టం చేశారు. ఈటలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న దళితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే దళిత బంధుతో తమకు బతుకుదెరువు చూపుతున్న టీఆర్ఎస్కే మద్దతు ఇస్తామని, ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌నే గెలిపించుకుంటామని స్పష్టం చేయడం విశేషం. దళితుల ఓట్లు తనకు రావని, ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ ఈ పథకాన్ని ఆపే కుట్రలు చేస్తున్నారని అన్నారు. నేను బహుజనున్నని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ దళితులు బాగుపడుతుంటే ఓర్చుకో లేక పోతున్నారని వాపోయారు. ఈటలకు డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని, మా మద్దతు టీఆర్ఎస్కే ఉంటుందని, గెల్లు శ్రీనివాస్‌ను మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని దళితులు స్పష్టం చేశారు.
రహదారిపై దళితుల బైటాయింపు
బీజేపీ నేత ఈటల రాజేందర్ తీరుకు నిరసనగా బుధవారం వీణవంక మండలకేంద్రంతో పాటు వల్బాపూర్‌లో దళిత మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో జమ్మికుంట-కరీంనగర్ ప్రధాన రహదారిపైకి వచ్చి బైటాయించారు. గంటకు పైగా ధర్నా చేశారు. ‘ఈటల రాజేందర్ డౌన్.. డౌన్.. దళితద్రోహి.. ఓట్లు అడగడానికి దళిత వాడలకు రావొద్దు’ అంటూ నినదించారు. ‘సీఎం కేసీఆర్ జిందాబాద్, జై దళితబంధు, జైజై టీఆర్ఎస్’ అంటూ చేతులు పైకెత్తి జేజేలు కొట్టారు. మామిడాలపల్లిలో ఈటల రాసిన లేఖప్రతిని చించుతూ నిరసన తెలిపారు.
మా కాలనీల్లో అడుగు పెట్టనీయం
ఈటల రాజేందర్‌పై హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తమ నోటికాడి బుక్కను ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆయనపై ఆగ్రహిస్తున్నారు. ఒక్క వీణవంక మండలంలోనే కాకుండా పలు చోట్ల దళిత నాయకులు ప్రెస్మీట్లు పెట్టి ఖండిస్తున్నారు. ఈటల సహజంగా ఈర్షపరుడని, ఒకరి మేలును కాంక్షించే నాయకుడు కాదని, తానొక్కడే బాగుపడాలనుకునే స్వార్థపరుడని దళితులు స్పష్టం చేస్తున్నారు. తమకు దారి చూపుతుందని భావిస్తున్న దళిత బంధు పథకాన్ని అడ్డుకుంటున్న ఈటల రాజేందర్‌ను తమ కాలనీల్లో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు.