కొత్తపల్లి, అక్టోబర్ 28: నగరంలోని మంకమ్మతోట మానేరు పాఠశాల మైదానంలో జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో సాయి మానేరు విద్యా సంస్థల సౌజన్యంతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్, కెడెట్ జూడో పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు తెలంగాణ జూడో సంఘంలో సభ్యత్వం ఉన్న సుమారు 450 మందికి పైగా బాలబాలికలు, 100 మంది అధికారులు, కోచ్‌లు, మేనేజర్లు హాజరయ్యారు. కాగా, ముఖ్య అతిథిగా డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్ హాజరై పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలపై దృష్టిపెట్టి రాణించాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించి రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. మానేరు విద్యా సంస్థల అధినేత, జూడో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించినప్పుడే కరీంనగర్, తెలంగాణ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుందన్నారు. భారత జూడో సమాఖ్య కోశాధికారి కైలాసం యాదవ్, జూడో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, జూడో క్రీడను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. అనంతరం అంతర్జాతీయ జూడో దినోత్సవాన్ని పురస్కరించుకొని అతిథులు కేక్ కట్ చేశారు. పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను నవంబర్ 7 నుంచి పంజాబ్‌లోని చంఢీఘడ్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి జూడో పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లకు ఎంపిక చేశారు. పోటీల అబ్జర్వర్, డీవైఎస్వో రాజవీరు, ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, జిమ్నాస్టిక్ సంఘం అధ్యక్షుడు నిరంజనాచారి, జూడో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజీజ్, క్రీడా సంఘాల బాధ్యులు, రెఫరీలు, మేనేజర్లు సిలివేరి మహేందర్, సంతోష్, ఎల్వీ రమణ, రాము, నాగరాజు, శ్రీకాంత్, మహేందర్, సాయిరాం పాల్గొన్నారు.