జమ్మికుంట రూరల్, అక్టోబర్ 28: స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ సత్యనారాయణ సూచించారు. పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం పోలీస్ విధుల కేటాయింపు సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సీపీ హాజరై మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా సహించబోమన్నారు. పార్టీల నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉప ఎన్నిక కోసం ముగ్గురు అడ్మిన్ ఎస్పీలు, 15మంది ఏసీపీలు, 60మంది సీఐలు, 180మంది ఎస్ఐలు, 421మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,182మంది కానిస్టేబుళ్లు, 168మంది మహిళా కానిస్టేబుళ్లు, 268మంది మహిళా హోంగార్డులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలోని 168 ప్రాంతాల్లో 306 పోలింగ్ బూత్‌లుండగా 68 సమస్యాత్మక బూత్‌లుగా గుర్తించామన్నారు. ఇక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పారామిలటరీ బలగాలను మోహరించామని తెలిపారు. ఇప్పటివరకు రూ.3కోట్ల నగదు, రూ.6.68 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన 43మంది టీఆర్ఎస్, 38మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్, 35మంది ఇతరులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. రానున్న 48 గంటలు ఎంతో కీలకమని వివరించారు. డబ్బులు ఇచ్చినా, తీసుకున్నా 171 సెక్షన్ కింద కేసులు తప్పవని, ఎన్నికల నిర్వహణకు ఎవరు విఘాతం కలిగించినా కేసులు తప్పవని హెచ్చరించారు.