నలుగురు మృతుల మిస్టరీని ఛేదించాలి
రాజేందర్ దుర్మార్గాలకు ఎందరో బలి
ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్
హుజూరాబాద్, ఆగస్టు 28: బీజేపీ నేత ఈటల రాజేందర్ దుర్మార్గానికి చాలామంది బలయ్యారని, ఆయా ఘటనలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈటల అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాన్ని కమలాపూర్ మండలానికి చెందిన ఉప సర్పంచ్ సుధాకర్ పగులగొట్టాడనే కారణంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారని తెలిపారు. పోలీసులు అతడిని వేధింపులకు గురి చేయడం అప్పట్లో చర్చకు దారి తీసిందన్నారు. అతడు ఠాణా నుంచి విడుదలైన 15రోజులకే కారు యాక్సిడెంట్లో మృతి చెందాడని తెలిపారు. అయితే సుధాకర్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన ఎంపీటీసీ బాలరాజు ఈటల రాజేందర్‌ను అభివృద్ధి గురించి ప్రశ్నించిన 15 రోజులకే హత్యకు గురయ్యాడని తెలిపారు. బాలరాజు హత్య వెనుక ఈటల హస్తం ఉందని ఆరోపిస్తూ 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సింగాపూర్‌కు వెళ్లిన ఈటలను గ్రామస్తులు అడ్డుకొని చెప్పులు, చీపుర్లు విసిరారని గుర్తు చేశారు. దీన్ని జీర్ణించుకోలేకనే ఈటల 38 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. అలాగే కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి సర్పంచ్ భగవాన్‌రెడ్డి వ్యాన్ యాక్సిడెంట్లో మృతి చెందడంపై అనుమానాలు రేకెత్తగా, కొందరు నిందితులు తామే చంపామని ఠాణాలో ఒప్పుకొన్నారని తెలిపారు.
అయితే ఈటల రాజేందర్, భగవాన్‌రెడ్డి మధ్య భూమికి సంబంధించి ఆర్థిక పరమైన విభేదాలున్నట్లు ఆరోపించారు. దీనికి ముందు రెండుసార్లు భగవాన్‌రెడ్డి హత్యకు రెక్కీ కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అలాగే, హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసే ప్రవీణ్‌యాదవ్‌ను ఆపరేషన్ వార్డుకు సంబంధించిన డాటాను తప్పుగా ఇవ్వమని ఈటల ఒత్తిడి చేయగా ఒప్పుకోకపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపారు. అంతేగాకుండా అతడిని ఠాణాకు పిలిపించి శారీరకంగా, మానసికంగా హింసించారని ఆరోపించారు. దీంతో మనోవేదనకు గురైన ప్రవీణ్‌యాదవ్ గుండెపోటుతో మృతి చెందాడని తెలిపారు. తన భర్త చావుకు ఈటల వేధింపులే కారణమని ప్రవీణ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఇవే కాకుండా వెలుగులోకి రాని ఈటల అకృత్యాలు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు. నలుగురి మృతిపై ఉన్నతాధికారులతో కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, అధికార ప్రతినిధి కదిరె రమేశ్, కార్యదర్శి దాట్ల ప్రవీణ్, చల్లూరి రాహుల్ తదితరులున్నారు.