వీణవంక, జూన్ 28: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గొల్ల, కుర్మలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని, గొర్రెల పంపిణీతో జీవితాలు బాగుపడుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. వీణవంక మండలం కిష్టంపేట ఫంక్షన్హాల్లో సోమవారం గొల్ల, కుర్మల సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసుతో కలిసి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయిండని, మీ ఓట్లతో గెలిచి, అన్ని పదవులు అనుభవించి బీజేపీలో చేరిన స్వార్థపరుడు అని మండిపడ్డారు. మీరంతా ఆశీర్వదిస్తేనే కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారని, ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా అందరూ కలిసి కట్టుగా పని చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చేవారంలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో గొల్ల, కుర్మలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు, సంఘ భవనాలు మంజూరు చేస్తుందని, పెండింగ్‌లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేస్తామని చెప్పారు.
కులసంఘం మీటింగ్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చిన వారికి అభినందనలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీని నిండుమనసుతో ఆశీర్వదించాలని, హుజూరాబాద్ నియోజకవర్గ మరింత అభివృద్ధికి కృషి చే యాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ గొల్ల, కుర్మలు మూగజీవాలను నమ్ముకొని, నిజాయితీగా బతికేవారని కొనియాడారు. మనమీద దాడి చేయడానికి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ రాబోతున్నాడని, రానున్న ఎన్నికలలో టీఆర్ఎస్కు అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మల్లన్నపల్లి గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ గొల్ల, కుర్మల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజయ్య యాదవ్, ఎంపీ పీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయ భాస్కర్‌రెడ్డి, కో ఆప్షన్‌మెంబర్ హమీద్, గొల్ల,కుర్మ సంఘం నాయకులు గెల్లు మల్లయ్య, చిన్నాల అయిలయ్య, మర్రి స్వామి, టీఆర్ఎస్ నాయకులు మేకల ఎల్లారెడ్డి, ఊట్ల దేవయ్య, మధుకర్‌రెడ్డి, తండ్ర శంకర్ ఉన్నారు.
కేసీఆర్‌తోనే కులవృత్తులకు జీవం
గత ప్రభుత్వాల హయాంలో కుల వృత్తులకు ప్రోత్సాహం లేక జీవితాలు ఆగమైనయ్. గొల్ల, కుర్మలు బతుకుదెరువు దొరక్కడ ఇబ్బందులు పడ్డరు. ఉన్న కాడికి వ్యవసాయం చేసుకొని బతుకుదెరువు జూసుకున్నం. రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ పాలనలో మంచిరోజులు వచ్చినయ్. గొర్రెల పంపిణీతో చాలా మంది బతుకులు బాగుపడ్డాయి. వాటితో ఈ రోజు ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఎదిగాయి. ఎవరికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకండా గొల్ల, కుర్మలు ఆత్మగౌరవంతో బతుకుతున్నరు. అప్పుడు ఇచ్చిన 21 గొర్లు ఇప్పుడు పెద్ద మందయింది. జీవనోపాధి పెరిగింది. ప్రతి గొల్ల, కుర్మ కుటుంబాలు సీఎం కేసీఆర్‌తోనే ఉంటాయి. మేమంతా టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటం.
–చిన్నాల అయిలయ్య యాదవ్, మాజీ సర్పంచ్, వీణవంక.
టీఆర్ఎస్సే మాకు కొండంత అండ
టీఆర్ఎస్ పార్టే గొల్ల, కుర్మలకు కొండంత అండ. గతంల ఏ ప్రభుత్వాలు గొల్ల, కుర్మలను పట్టించుకున్న పాపాన పోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చినంక మా బతుకులు బాగుపడ్డయి. సబ్సిడీ గొర్రెలు, వ్యక్తిగత లోన్లు ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేసింది. నాకు సబ్సిడీ గొర్లు, లోన్లు వచ్చినయి. ఇప్పుడు నేను ఆర్థికంగా బలపడ్డా. నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్న. సీఎం కేసీఆరే మా నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసి గులాబీ జెండా ఎగురడానికి కృషి చేస్తాం.