రామగుండం మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు వేగవంతం
తాజాగా 500 కోట్లు మంజూరు చేసిన సింగరేణి
సంస్థ బోర్డు ఆఫ్ డెరెక్టర్ల సమావేశంలోనూ ఆమోదం
అమల్లోకి ముఖ్యమంత్రి హామీ రెండేళ్లలోనే అందుబాటులోకి రానున్న భవనం
సీఎం కేసీఆర్కు సీఎండీ శ్రీధర్ కృతజ్ఞతలు
గోదావరిఖని, డిసెంబర్ 27: రామగుండం ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రాంత ప్రజలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కళాశాలతోపాటు కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం దవాఖాన ఏర్పాటు చేస్తామని రెండేళ్ల క్రితం శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా తరచూ సీఎంను కలుస్తూ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు చందర్ ప్రయత్నం ఫలించింది. ఇటీవల జరిగిన సమావేశంలో దవాఖాన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో సంస్థ సీఎండీ శ్రీధర్ చొరవ తీసుకోగా, ఈ నెల 10వ తేదీన జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో 500 కోట్ల కేటాయింపునకు ఆమోదం లభించింది. సోమవారం కొత్తగూడెంలో జరిగిన చారిత్రాత్మక సింగరేణి 100వ వార్షిక సర్వసభ్య సమావేశంలోనూ తన అంగీకారం తెలిపింది. ఈ మేరకు రూ.500 కోట్లు నిధులను సింగరేణి మంజూరు చేసింది.
వేలాది కార్మికులకు ప్రయోజనం..
సింగరేణి నిధులతో ఏర్పాటు చేసే ఈ వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ దవాఖానలో హైదరాబాద్ లాంటి నగరాల్లో లభించే అన్ని రకాల వైద్య విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందజేయనున్నారు. దీని వల్ల సింగరేణి కార్మికులు, రిటైర్డు కార్మికులు, వారి కుటుంబీకులకే గాకుండా పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల వేలాది మంది ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతోపాటు సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ కాలేజీ సీట్లలో పది శాతం లబ్ధి చేకూరనున్నది.
రెండేళ్లలో నిర్మాణం..
సింగరేణి సంస్థ ఇప్పటికే సీఎస్సార్, డీఎంఎఫ్టీ నిధులతో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి చేయూతనిస్తున్నది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంత ప్రజల వైద్య అవసరాలు, వైద్య విద్యకు ప్రోత్సాహకంగా మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు 500 కోట్లు మంజూరు చేయడం సంస్థ 133 ఏండ్ల చరిత్రలో ఇదే ప్రథమం. ఈ కళాశాలను రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ అందుబాటులో ఉండాలన్న కార్మికుల చిరకాల కోరిక మరో రెండేళ్లలో సాకారం కానుంది.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
రామగుండంలో సింగరేణి సంస్థ ద్వారా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు, సింగరేణి కార్మికుల తరపున రుణపడి ఉంటాం. ఎన్నో ఏళ్లుగా మెడికల్ కాలేజీ కోసం ఎదురుచూస్తున్న ప్రజల కలను సాకారం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. గతంలో నేను రెండు సార్లు అసెంబ్లీలో మెడికల్ కాలేజీ కోసం చర్చించా. దాంతో సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ మెడికల్ కాలేజీ వస్తే సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ సీట్లలో 10 శాతం రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడే కాదు భూపాలపల్లి జిల్లాలోని ఎంతోమంది నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానున్నది. ఇందుకు సహకరించిన సీఎండీకి కూడా కృతజ్ఞతలు.