ప్రజలు భాగస్వాములయ్యేలా చూడండి
హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ ఆశించిన ప్రగతి కనిపించాలి
సమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్‌టౌన్, ఆగస్టు 23: హుజూరాబాద్ నియోజకవర్గంలో చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేయండి..ప్రజలను భాగస్వాములను చేసి పనుల్లో వేగం పెంచండి’ అంటూ అధికారులు, కాంట్రాక్టర్లకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన మేరకు ప్రతివాడలో పనులు జరగాలని స్పష్టం చేశారు. హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని, ఇప్పటికే మంజూరు చేసిన పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు వేగంగా చేసి గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయడంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలన్నారు. పట్టణంలో పలుచోట్ల చేపడుతున్న 122 సీసీరోడ్లు నిర్మాణాన్ని నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లను మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకన్న, చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, ఈఈ సంపత్‌కుమార్, డీఈ రవీంద్రనాథ్, ఏఈలు రాజ్‌కుమార్, అనిల్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.