‘ప్రత్యామ్నాయ సాగు’తో మంచి లాభాలు
పంట మార్పిడితో రైతుకు అన్ని రకాలుగా మేలు
ఏండ్లపాటు ఒకే రకం పంటతో నష్టాలు
యాసంగిలో ఆరుతడే బెటర్ అంటున్న శాస్త్రవేత్తలు
కరీంనగర్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : అదే పంట మార్పిడి చేస్తే.. రైతుకు ఎన్నో రకాలుగా ఫాయిదా ఉంటది. ప్రధానంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుంది. నాణ్యమైన పంట చేతికి వస్తుంది. మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకుంటే.. కరెంట్, నీరు, ఎరువుల వాడకం తగ్గి మంచి లాభం మిగులుతుంది. ఏండ్లపాటు ఒకే పంట వేయడం వల్ల నేల నిస్సారంగా మారుతున్నదని సుస్థిర వ్యవసాయ కేంద్రం (సెంటర్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చర్) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అందుకే పంట మార్పిడి చేస్తూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే అన్ని విధాలా మేలు జరుగుతుంది.
పచ్చని పల్లెల్లో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన పరిసరాలు ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ, ఇప్పుడు గ్రామాల్లో ఆ పరిస్థితి కనిపించని పరిస్థితులు నెలకొంటున్నాయి. 165.35 కోట్లకుపైగా చెట్లు పదేళ్లలో పీల్చుకునే కార్బన్ డయాక్సైడ్ ఒక్క ఏడాది వరి సాగుతో ఉత్పత్తి అవుతోందని, దీనిని బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడున్న చెట్లు, అడవులు సరిపోవని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. వరిసాగుకు నీళ్లు, రసాయనిక ఎరువులు అధికంగా వాడడంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంట మార్పిడి చేస్తేనే ఇటు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా రైతులకు లాభాలు వస్తాయని సూచిస్తున్నారు.
జాతి పంటలు.. జగతికి వెలుగులు
పంటల వైవిధ్యీకరణతోనే పంటల సరళిలో ఉత్తమమైన మార్పులు కనిపిస్తాయని, పప్పు దినుసులు, నూనెగింజల అవసరానికి ఉత్పత్తికి మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండడం వల్ల యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఇతర పంటలు, రకాలు, దిగుబడి అంచనాలను వివరించారు. ప్రతిసారి వరి సాగు చేయడం వల్ల మార్కెటింగ్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు నేలసారం తగ్గుతుందని, పంటల మార్పిడి వల్ల ఉత్తమమైన మార్పులు వస్తాయని, పర్యావరణ సమతుల్యత పెరుగుతుందని సూచించారు. ఈ క్రమంలో అన్ని నేలలకు అనుకూలమైన పంటలు, వాటి దిగుబడికి సంబంధించిన వివరాలను వ్యవసాయశాఖ విడుదల చేయడమే కాకుండా, ప్రచారం సైతం ప్రారంభించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
పంట మార్పిడితోనే మేలు
సంప్రదాయ పంటలకు బదులు బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఇదివరకే సిఫారసు చేసింది. కంది, పల్లి సాగును పెంచాలని సూచించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు వానకాలంలోనే వరి సాగు ఎక్కువగా ఉండేది. యాసంగిలో నువ్వులు, పల్లి, శనగ, పొద్దుతిరుగుడు, తదితర పప్పు ధాన్యాలు, నూనె గింజలు పండించే వారు. ఇప్పుడు పాత పద్ధతిలోకే వెళ్లాలని, వరిసాగు విపరీతంగా వేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. పప్పు దినుసుల సాగు తగ్గడంతో వాటి ధరలు పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి. నూనె గింజల సాగు తగ్గడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. వీటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూగాయల సాగుపైనా దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరి సాగు చేస్తే ఆరు నెలల వరకు డబ్బులు వస్తాయని, అదే కూరగాయల సాగుతో ప్రతి రోజూ ఆదాయం వస్తుందని, స్థానిక అవసరాలకు అనుగుణంగా పంటలు పండిస్తే వ్యవసాయం లాభసాటిగా మారి రైతులకు మంచి ఆదాయం వస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా వర్షాధార పంటలుగా ఉన్న కంది, పెసర, పత్తి, తదితర పంటలను నీటి పారుదలగా మార్చితే మంచి దిగుబడులు వస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు.
సాగు ప్రణాళిక చేసుకోవాలి..
మన దగ్గర ఏటేటా వరి సాగు అసాధారణ రీతిలో పెరుగుతోంది. మన భూముల పరిస్థితి ఏమిటి, వాటిలో ఏ పంటలు వేసుకోవచ్చు, ఇక్కడి ప్రజల అవసరాలను ఏ పంటలు తీరుస్తాయి, అనే కోణంలో రైతు సాగు ప్రణాళిక తయారు చేసుకోవాలి. వరికి అవసరానికి మించి నీరు ఇవ్వడంతో వాతావరణం త్వరగా కాలుష్యమవుతోంది. ఆహార భద్రత, నేల సంరక్షణ దృష్ట్యా పంట మార్పిడి తప్పని సరిగా పాటించాలి. వరి తర్వాత ఆ పొలంలో పప్పు దినుసులు వేసుకుంటే మంచిది. ఒకే నేలపై రెగ్యులర్గా వరినే సాగు చేస్తామంటే రాబోయే రోజుల్లో నేల సాగుకు పనికిరాకుండా పోతుంది. భూసారం తగ్గి చౌడు భూముల సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.