ఏడాదికి రూ.2.60లక్షల ఫీజు చెల్లించే స్థోమత లేక చదువుకు ఆటంకం
దాతల సాయం కోసం ఎదురుచూపు
పాలకుర్తి, నవంబర్ 16: సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువైంది. ఎంతో ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులకు వెళ్లేందుకు పేదరికం అడ్డుపడుతున్నది. దీంతో దీనస్థితిలో ఆ పేద విద్యార్థిని దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన మడిపెల్లి దీప ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు రామగుండంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివింది. జేఈ ఈమెయిన్స్ రాసి ఆల్ఇండియా స్థాయిలో 9000 ర్యాంక్ సాధించింది. హమాలీ పని చేసి కుటుంబాన్ని పోషించే దీప తండ్రి లక్ష్మణ్ కౌన్సిలింగ్ కోసం అతికష్టంగా రూ.60వేలు చెల్లించగా గుజరాత్ రాష్ట్రంలోని వడోధరలోగల నేషనల్ రైల్వే ట్రాన్స్‌పోర్టు ఇనిస్టిట్యూట్‌లో ఎన్ఐటీలో సీటు సాధించింది. కానీ ఇక్కడే ఈ పేద విద్యార్థినికి అసలు సమస్య వచ్చి పడింది. అక్కడ చదువు కొ నసాగించాలంటే ఏడాదికి రూ.2.60లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అసలే పేదరికంలో మగ్గుతున్న ఈ కుటుంబానికి ఇంత పెద్ద మొత్తం వెచ్చించి చదివించే స్థోమత లేదు. దీంతో ఆ విద్యార్థిని ఉన్న త చదువుకు దూరమయ్యే దుస్థితి నెలకొంది.
దాతల సాయం కోసం నిరీక్షణ..
తెలంగాణ సర్కార్ నెలకొల్సిన గురుకుల పాఠశాలలో ఎలాంటి ఆటంకం లేకుండా ఇంటర్ వరకు ఉచిత విద్యను పొందిన దీప ప్రతిభావంతురాలు. జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటి ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్‌లో ఎన్ఐటీలో సీటు సాధించినా పేదరికం ఆమె చదువుకు మోకాలడుతున్నది. ఆమె ఎన్ఐటీలో చదువు కొనసాగించాలంటే ఏడాదికి రూ.2.60లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తనకు హమాలీ పని ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబ పోషణకే సరిపోని స్థితిలో కూతురిని ఉన్నత చదువుకు ఎలా పంపించేదని లక్ష్మణ్ ఆవేదన చెందుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన కూతురు చదువు కొనసాగించేందుకు సాయమందించాలని దీనంగా వేడుకుంటున్నాడు. ఎస్బీఐ అకౌంట్ నంబర్ 38719207589కు గాని, లేదా 8008599765 నంబర్‌కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా గాని ఆర్థికసాయం అందిస్తే జీవితాంతం రుణపడి ఉంటానని ప్రార్థిస్తున్నాడు.
సాయమందిస్తే చదువు కొనసాగిస్తా..
సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో గురుకుల పాఠశాలలో ఇంటర్ వరకు ఉచిత విద్యనభ్యసించాను. 10వ తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్లో 942 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 9000 ర్యాంక్ సాధించి కౌన్సిలింగ్ ద్వారా గుజరాత్ రాష్ట్రంలోని వడోధరలోగల నేషనల్ రైల్వే ట్రాన్స్‌పోర్టు ఇనిస్టిట్యూట్‌లో ఎన్ఐటీలో సీటు దక్కించుకున్నా. పేదరికం కారణంగా అక్కడ చదువు కొనసాగించలేని పరిస్థితి. ఎవరైనా దాతలు సాయమందిస్తే ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి రైల్వే ద్వారా దేశానికి సేవచేస్త.