e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 27, 2022
Home కరీంనగర్ బీజేపీ బీసీల వ్యతిరేకి

బీజేపీ బీసీల వ్యతిరేకి

చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరినం
మోడీ మొదట ఒప్పుకున్నడు.. తర్వాత తప్పుకున్నడు
మన గోడు పట్టని బీజేపీ మనకెందుకు?
గెల్లు సీనును దీవించాలె
బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆర్‌ కృష్ణయ్య

హుజూరాబాద్‌, అక్టోబర్‌ 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీల పచ్చి వ్యతిరేకి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య మండిపడ్డారు. మండల కమిషన్‌ నుంచే బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లను ఆ పార్టీ వ్యతిరేకిస్తున్నదని, ఇపుడు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని చెబితే వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. ఈ విషయాలపై ప్రధాని మోడీని కలిసి విన్నవించినపుడు ఒప్పుకున్నారని, ఆ తర్వాత ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి తప్పుకున్నారని విమర్శించారు. ఇదేంటని అడిగితే తానో నిమిత్త మాత్రుడినని మా ముందే చెప్పారని కృష్ణయ్య వివరించారు. గురువారం ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ను సన్మానించి మాట్లాడారు.

- Advertisement -

పాకిస్తాన్‌ నుంచి వచ్చామా..?
బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్లు కావాలని, కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. బీసీలంటే బీజేపీ చులకనగా చూస్తోందని, ఈ వర్గాలను ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. మనమేమన్నా ఎక్కడో పాకిస్తాన్‌, చైనా, అమెరికా నుంచి రాలేదని, ఇక్కడి భూమి పుత్రులమని, నికార్సైన హిందువులమని చెప్పారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం సరైనది కాదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని, ఒకసారి ఓటు వేస్తేనే ఇంత దారుణాలకు ఒడిగడుతున్న ఆ పార్టీకి మళ్లీ ఓటు వేయవద్దని కోరారు. బీసీల గోడు పట్టించుకోని బీజేపీ ఎక్కడ ఎన్నికల్లో పాల్గొన్నా అక్కడ ఈ పార్టీ ఓటమికి బీసీలు కంకణబద్దులు కావాలని ఆర్‌ కృష్ణయ్య పిలుపునిచ్చారు.

త్వరలోనే బీసీ బంధు
రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినపుడు తానే స్వయంగా వెళ్లి బీసీలకు కూడా ఇలాంటి పథకం పెట్టాలని చెప్పగా కేసీఆర్‌ సానుకూలంగా స్పందిం చి అమలు చేశారని స్పష్టం చేశారు. ఇపుడు దళిత బంధు ప్రవేశ పెట్టినపుడు కూడా తాను వెళ్లి కలిశానని, బీసీ బంధు కూడా పెడతామని తనకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని ఆర్‌ కృష్ణయ్య చెప్పారు. కేసీఆర్‌పై తనకు ఎంతో విశ్వాసం ఉంద ని, త్వరలో బీసీ బంధు పెడతారనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తదితర బార్డర్‌ రాష్ర్టాల ప్రజలు తనను కలిసినపుడు ఇక్కడ అమలవుతున్న పథకాల గురించి ప్రస్తావించి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని కొనియాడుతున్నారని తెలిపారు. రాయలసీమకు చెందిన జేసీ దివాకర్‌రెడ్డి కూడా తమను తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నారని, ఇంత మంచి స్వర్గసీమలో ఉండడం మనకు గర్వకారణమన్నారు. ఇతర రాష్ర్టాల్లో బీసీల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, తెలంగాణలో అయితే అడిగిన వెంటనే సీఎం కేసీఆర్‌ అనేక గురుకులాలను ఏర్పాటు చేశారని చెప్పారు. గురుకులాల్లో చదువుకునే పిల్లలు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడతారని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న ఎన్నికలో సానుభూతిని చూసో, బట్టెబాజి మాటలు నమ్మి మోసపోవద్దని, మనకు ఎవరు మేలు చేస్తున్నారో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తెలంగాణ ఉద్యమంలో తనతోనే ఉన్నారని, ఎంతో పోరాడారని చెప్పారు. ఆయన్ను గెలిపించాలని కోరారు. సమ్మేళనంలో ఇంకా రాజారాం యాదవ్‌, వివిధ కుల సంఘాలకు చెందిన రాష్ట్ర నాయకులు గాదె సమ్మయ్య, శివాజి, రాజ్యలక్ష్మి, రాజేశ్వరి, జయంత్‌రావు, డాక్టర్‌ కే శ్రీనివాస్‌, సాయిపటేల్‌, కోల శ్రీనివాస్‌, గోనే శ్రీనివాస్‌, వైద్య వెంకటేశ్వర్లు, మంద రాజమల్లు, దాస్యం సత్యం, వేణుమాధవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్‌ కృష్ణమోహన్‌ను ఆర్‌ కృష్ణయ్య, వివిధ బీసీ కుల సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement