స్వరాష్ట్రంలో పండుగలా సాగు
వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లోనూ చేతినిండా పని
పనికి తగ్గ కూలి.. వేలాది మందికి ఉపాధి
మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఏపీ నుంచి రాక
నాట్ల నుంచి ధాన్యం రవాణా, పత్తి ఏరేదాకా అన్ని పనుల్లో వీళ్లే
మూడేండ్లలో పెరిగిన కూలీల సంఖ్య రైస్‌మిల్లుల్లోనూ 80 శాతం అక్కడి వారే..
కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): నేడు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితులన్నీ మారిపోయినయ్. సాగు పండుగలా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడంతో సాగునీటి వసతి పెరిగింది. ఊహించని విధంగా బీడు భూములన్నీ సాగులోకి వచ్చినయ్. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లో కూడా పనులు పెరిగినయ్. స్థానికంగా కూలీల కొరత ఏర్పడింది. ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు ఉపాధి వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నరు. దుక్కులు దున్ని, నాట్లు వేసే దగ్గరి నుంచి ధాన్యం మోసే పనులు.. పత్తి ఏరడం వరకు అన్ని పనుల్లోనూ వారే కనిపిస్తున్నరు. చేతినిండా పని.. పనికి తగ్గ కూలి ఉండడంతో ఇక్కడే స్థిరపడుతున్నరు. వారి రాష్ర్టాల్లో ఒక్కరు రోజుకు 200 సంపాదిస్తే.. ఇక్కడ వెయ్యి నుంచి 1500 వరకు సంపాదిస్తూ సంతోషంగా గడుపుతున్నరు.
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయం ఊహించని రీతిలో విస్తరించింది. గతంలో బీళ్లుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయి. కూలీ నాలీ చేసుకున్న జిల్లా వాసులు నీటి వసతి పెరగడంతో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒక పక్క వ్యవసాయం విస్తరించడం, మరో పక్క చాలా మంది కూలీలు రైతులుగా మారడంతో ఒక్కసారిగా కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడి రైతులకు ఏర్పడింది. నాట్లు వేయడం నుంచి కోతలు, మోతల వరకు అన్ని పనులు ఇప్పుడు వలస కూలీలే చేస్తున్నారు. నాట్లు వేసేందుకు బిహార్, పశ్చిమబెంగాల్ నుంచి వందలాది మంది వస్తున్నారు. ఆయకట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లోనే మకాం వేస్తున్న కూలీలు ప్రతి సీజన్లో రెండు మూడు నెలలు ఇక్కడే ఉంది నాట్లు వేసి వెళ్తున్నారు. గుత్తలు పట్టుకుని వేస్తున్నారు. స్థానిక రైతులు వారికి ఎలాంటి లోటు లేకుండా వసతులు కల్పిస్తున్నారు. చాలా మంది వాళ్ల పనులు పూర్తయ్యే వరకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు.
మిల్లు మిల్లుకూ బిహారీలే..
దాదాపు ప్రతి రైస్ మిల్లులో బిహారీలు హమాలీలుగా పనులు చేసుకుంటున్నారు. వ్యవసాయ పనులు పెరగడంతో స్థానిక హమాలీలు ఎక్కువగా తమ సొంత భూముల్లోగానీ, భూములు కౌలుకు తీసుకొనిగాని వ్యవసాయం చేసుకుంటున్నారు. దీంతో బిహార్ నుంచి వచ్చే కూలీలే ఎక్కువగా హమాలీ పనుల్లో స్థిరపడ్డారు. ముఖ్యంగా ప్రతి బాయిల్డ్ రైస్‌మిల్లులో కనీసం 20 మంది అవసరం ఉంటుండగా, వీరిలో 18 మంది బిహారీలే పని చేస్తున్నారు. మిగతా ఇద్దరు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వాళ్లుగానీ, స్థానికులుగానీ ఉంటున్నారు. మిల్లర్లు కల్పిస్తున్న వసతుల్లోనే ఉంటూ టైం టూ టైం పనులు చేసుకుంటున్నారు. 24 గంటలు మిల్లుల్లోనే ఉండి అవసరమైనపుడల్లా పనులు చేస్తుండడంతో మిల్లర్లకు కూడా పనులు సులువుగా జరుగుతున్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లాలో 175 రైస్‌మిల్లులు ఉంటే సుమారు 3,500 మంది పనులు చేస్తున్నారు. ఇందులో 80 శాతం బిహారీలే కనిపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోనూ వందలాది రైస్‌మిల్లులు ఉండగా, అక్కడ కూడా వారే ఉన్నారు.
బిహార్ నుంచే 80 శాతం కూలీలు
బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలు వస్తుండగా, ఇందులో 80 శాతం బిహార్ నుంచే ఉంటున్నారు. కొందరు నేపాలీలు కూడా ఇక్కడికి వచ్చి రైస్ మిల్లుల్లో పనులు చేసుకుంటున్నారు. గిట్టుబాటు కూలీ, క్రమం తప్పకుండా పనులు దొరకడంతో ఇక్కడికి క్యూ కడుతున్నారు. నాట్లు వేసే పనులు ఏడాదిలో రెండు సీజన్లలో మాత్రమే లభిస్తున్నా ఆ కొద్ది కాలం ఇక్కడికి వచ్చి పనులు చేసుకుని ఆశించినంత సంపాదించుకుని తిరిగి వాళ్ల సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. గత రెండు మూడేళ్లలో ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చే కూలీల సంఖ్య విపరీతంగా పెరిగింది. కొందరు కేవలం వరి నాట్లకే కాకుండా రైస్ మిల్లుల్లో హమాలీలుగా, కూలీలుగా ఉంటున్నారు. రెండు మూడేళ్లుగా హమాలీ పనులు క్రమం తప్పకుండా లభిస్తుండడంతో ఏడాది పొడగునా ఇక్కడే ఉంటూ వీలు దొరికినపుడే సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక్కడి బాయిల్డ్ రైస్ మిల్లుల్లో ఎక్కువగా బిహార్ నుంచి వచ్చిన కూలీలే పనులు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనూ వీళ్లే హమాలీలుగా ఉంటున్నారు.
మాకు ఇంత అన్నం పెడుతుంది తెలంగాణనే..
నా పేరు మహారాజ. మాది బిహార్‌లోని సర్సా జిల్లా. మా దగ్గర పనిలేదు. కొన్నేండ్ల నుంచి ఎల్లారెడ్డిపేటకు అచ్చి కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల్లో పనిచేసుకుంటు బతుకున్నం. నేనే కాదు నాతో 30 మంది వచ్చినం. ఏడాదిలో యాసంగి, వానాకాలంల మాకు ఎనిమిది నెలలు పనిదొరుకుతది ఇక్కడ. కొనుగోలు కేంద్రాల్ల వడ్లు జోకిన తర్వాత లారీల్లో ఎక్కించే పనిచేస్తున్నం. మాకు క్వింటాల్‌కు 30 ఇస్తరు. రోజుకు 600 క్వింటాల్ల దాకా ఎక్కిస్త. వడ్ల సీజన్ల నాకు మంచిగ పనిదొరికితే నెలకు 40వేల -50 వేల దాకా దొరుకుతయి. ఈ పని అయిపోయిన తర్వాత మళ్లీ రైస్మిల్లుల్ల హమాలీ పనిచేత్తం. ఇన్ని పైసలు కూడబెట్టుకొని మా ఊరికి పోతం. మాకు ఇంత అన్నం పెడుతంది తెలంగాణనే. చానా సంతోషం.
పరదల అద్దె వ్యాపారం చేస్తున్నం
మా దగ్గర పనిలేదు. ఏం దొరుకదు. దొరికినపుడు చేసుకునుడు లేనప్పుడు అట్టిగనే ఉంటం. గప్పుడే తెలంగాణల అయితే ఎవుసం పని బాగా నడుస్తంది.. వడ్లు బాగా పండుతున్నయని తెలిసింది. పరదల అద్దె వ్యాపారం చేస్తే మంచిగుంటదని మా దగ్గరోళ్లు చెబితే ఇక్కడికి వచ్చినం. నేనే కాదు రెండేండ్ల నుంచి వరికోతల టైంల మా గుంటూరు నుంచి చానా మంది వచ్చి వ్యాపారం చేస్తున్నరు. ఒక్కో పరదను రైతులకు రూ.15 నుంచి రూ.20కి కిరాయి ఇస్తున్నం. సీజన్‌కు దాదాపు రూ.50వేల దాకా దొరుకుతయి. వడ్ల కాంట అయిన తర్వాత మళ్లీ మా ఊరుకు పోతం. ఇక్కడి రైతులు మమ్ముల ఏనాడూ ఇబ్బంది పెట్టలే. చానా మంచోళ్లు.