పెండింగ్ కేసుల పరిష్కారానికి అడ్వొకేట్లు కృషిచేయాలి
రాష్ట్ర హైకోర్టు జడ్జి షమీమ్ అక్తర్
రంగంపల్లిలో జిల్లా అదనపు సెషన్స్ కోర్టు, ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులు ప్రారంభం
పెద్దపల్లి, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): ‘ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా న్యాయవాదులు, న్యాయ శాఖ అధికారులు పనిచేయాలి. పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషిచేయాలి’ అని రాష్ట్ర హైకోర్టు జడ్జి షమీమ్ అక్తర్ సూచించారు. శనివారం పెద్దపల్లి మండలం రంగంపల్లిలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భవనం, పోక్సో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్రాక్ కోర్టులను ప్రారంభించారు. కాగా, జిల్లా కోర్టు భవనాల ప్రారంభానికి విచ్చేసిన హైకోర్టు జడ్జికి సీనియర్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేయగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కోర్టు ఆవరణలో హైకోర్టు జడ్జి సర్వ మత ప్రార్థనలు నిర్వహించి ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం అదనపు సెషన్ కోర్టు, పోక్సో కేసుల పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్రాక్ కోర్టులను ప్రారంభించారు. అనంతరం జడ్జిలు మాట్లాడారు. పెద్దపల్లిలో అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటుకు 1981 నుంచి డిమాండ్ ఉందని, ఇటీవలే రాష్ట్ర సర్కారు మంజూరు చేసిందని చెప్పారు. వెయ్యి కంటే అదనంగా కేసులు పెండింగ్‌లో ఉన్న ప్రాంతంలో అదనపు సెషన్స్ కోర్టులు ఏర్పాటు చేయడాన్ని సిఫారసు చేస్తామని, దాని ప్రకారం పెద్దపల్లిలో ఏర్పాటైందని వివరించారు. ఏడాదిన్నరగా కొవిడ్ నేపథ్యంలో కోర్టు నిర్వహణ వరుచువల్గా మాత్రమే జరిగిందని, ఇటీవలే తిరిగి కోర్టులు ఫిజికల్‌గా ప్రారంభమవుతున్నాయని తెలిపారు. జిల్లాలో నూతనంగా రెండు రోర్టు భవనాల ఏర్పాటుతో ఇక్కడి బార్ అసోసియేషన్, న్యాయవాదులపై బాధ్యత పెరిగిందని చెప్పారు. కాగా, జిల్లాలో కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కృషి చేసిన జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్‌కుమార్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు హైకోర్టు జడ్జిని ఘనంగా సన్మానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్జి ప్రియదర్శిని, పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి డీ వరూధిని, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణారెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్‌కుమార్, గంగి రెడ్డి, మల్లారెడ్డి, భాస్కర్, మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, డీసీపీ పులిగిళ్ల రవీందర్ ఉన్నారు.