రైతు భరోసాకు మరోసారి చాలా మంది రైతులు దూరమయ్యే పరిస్థితి వస్తున్నది. వివరాలు ఇవ్వలేదని సాకు చూపి 20 వేలకు పైగా మందికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపే ప్రయత్నం కనిపిస్తున్నది. ఒక పక్క సాగు చేస్తున్న భూ విస్తీర్ణానికి సరిపడా పెట్టుబడి సాయం అందడం లేదని వందలాది మంది రైతులు ఒకపక్క ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. వానకాలం రైతు భరోసా పూర్తయిందని ప్రభుత్వం రేపో, మాపో చేతులెత్తేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. కొన్ని బ్యాంకుల్లో సాంకేతిక సమస్యల కారణంగా పెట్టుబడి సాయం అందడం లేదని సమాచారం ఉన్నది. ఈ నేపథ్యంలో రైతు భరోసా అందని పరిస్థితి ఉండగా, వేలాది మంది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో రైతు భరోసాకు 2,10,904 మంది రైతులు అర్హులని నిర్ధారించారు. వీరికి 211 కోట్ల 90 లక్షల 69 వేల 841 పెట్టుబడి సాయంగా అందించాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటి వరకు 1,90,606 మంది వివరాలు మాత్రమే అధికారుల వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలుస్తున్నది.
వారి వద్ద ఉన్న వివరాల ప్రకారం 207 కోట్ల 12 లక్షల 4 వేల 857లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు విడుతల వారీగా ఆయా ట్రెజరీలకు పంపించారు. ఇందులో ఇప్పటి వరకు 1,90,196 మందికి 206 కోట్ల 64 లక్షల 78 వేల 043 మాత్రమే జమయ్యాయి. అధికారుల లెక్కల ప్రకారం మరో 410 మంది రైతులకు 47,26,814 చెల్లిస్తే రైతు భరోసా పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. కానీ, చివరి రైతు వరకు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇక్కడితోనే సరిపెట్టుకుంటే జిల్లాలో 20,708 మంది రైతులకు అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తున్నది.
ఇంత పెద్ద మొత్తంలో రైతులు వివరాలు ఇవ్వకపోవడం ఏమిటనే చర్చ జరుగుతున్నది. అయితే, ఈ నెల 5 వరకు భూభారతి (ధరణి)లో కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయిన రైతులు ఈ నెల 20 వరకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ ప్రకారంగా 2,420 మంది కొత్త రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా చూస్తే 20,708 మంది రైతుల వివరాలు అధికారుల వద్ద లేవని తెలుస్తున్నది.
ఇంకా రావాల్సినవి 5.33 కోట్లు
జిల్లాలో 20,708 మంది రైతులకు 5 కోట్ల 33 లక్షల 91 వేల 798లు అందాల్సి ఉంది. అధికారుల లెక్కల ప్రకారమే చూస్తే చొప్పదండి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 4,933 మంది రైతులకు కోటి 9 లక్షల 76 వేల 958, హుజూరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 4,295 మంది రైతులకు కోటి 23 లక్షల 69 వేల 782 రావాల్సి ఉంది. కరీంనగర్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 3,872 మంది రైతులకు 68,50,361 రావాల్సి ఉన్నది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో 2,065 మంది రైతులకు 72,68,686 అందాల్సి ఉన్నది. మానకొండూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 5,543 మంది రైతులకు కోటి 59 లక్షల 26 వేల 011 రావాల్సి ఉన్నది. ఈ రైతుల వివరాలు అందుబాటులో లేక పోవడం వల్ల పెద్ద మొత్తంలో ఆర్థికసాయం అందని పరిస్థితి కనిపిస్తున్నది.
ఎక్కువ భూమి ఉన్నా తక్కువకే..
పోయిన వానకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేదు. అంతకు ముందు యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఎకరానికి ఒక సీజన్‌కు 5 వేలు మాత్రమే ఇచ్చింది. అయితే, ఇప్పుడు రైతు భరోసా కింద ఒక సీజన్‌కు 6 వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నది. అయితే, ప్రస్తుత వానకాలం సీజన్‌కు యాసంగిలో పంటల నమోదు వివరాల ప్రకారం పెట్టుబడి సాయాన్ని అందించినట్లు తెలుస్తున్నది. వానకాలంలో వర్షాధారంగా పత్తి, మక్క ఇతర ఆరుతడి పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. అయితే, 2023-24 యాసంగిలో పంట నమోదు వివరాల ప్రకారంగా ఈ వానకాలం సీజన్‌కు ప్రభుత్వం గుడ్డిగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో రెండు మూడెకరాలున్న చిన్న సన్నకారు రైతులకు 20, 30 గుంటల భూమికే అందుతున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి రైతులు కరీంనగర్ జిల్లాలో వేల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఎక్కువ భూమి ఉండి తక్కువ విస్తీర్ణానికి మాత్రమే రైతు భరోసా అందుతున్న రైతుల వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండక పోవచ్చని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా రైతు భరోసా పెట్టుబడి సహాయం జమైనట్లు రైతుల సెల్ఫోన్లకు మెస్సేజ్‌లు వస్తున్నాయి.
తీరా బ్యాంకులకు వెళ్లి ఆరా తీయగా జమకాలేదని చెబుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో సాంకేతిక సమస్య కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఇలాంటి సమస్యలెక్కడా ఉత్పన్నం కాలేదని చెబుతున్నారు. ఒక వేల అలాంటి సమస్య ఉంటే సాంకేతిక సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమవుతుందని అంటున్నారు. కానీ ఎక్కువ భూమి ఉండి తక్కువ రైతు భరోసా జమైన రైతుల విషయంలో మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తున్నది.