అవి ఏ ఆధారం లేని బతుకులు. గత ప్రభుత్వాల వివక్ష, పట్టింపులేమితో దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న కుటుంబాలు. ఎవరోవస్తారని, ఏదో చేస్తారని ఏండ్లకేండ్లు ఎదురుచూసి అలసిపోయిన దళితుల జీవితాల్లో వెలుగు నిండింది. దళిత కులస్తులను ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి తేవాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకువచ్చిన ‘దళిత బంధు’ బతుకుబాట చూపుతున్నది. అందుకు సిరిసిల్ల జిల్లాలోని పలువురి జీవితమే నిదర్శనంగా నిలుస్తున్నది. మొత్తం 206 మంది లబ్ధిదారులకు సాయం అందజేయగా, ఒకప్పుడు దొరికిన పనల్లా చేసి.. ఉన్ననాడు తిని లేని నాడు పస్తులున్న ఎందరినో కోళ్లఫాం, పెట్రోల్ బంకు, వివిధ పరిశ్రమలు, డెయిరీ యూనిట్లకు ఆయిల్, దాల్, రైస్‌మిల్లులకు యజమానులుగా మార్చింది. నాడు పనికోసం పాకులాడిన వారే నేడు మరో నలుగురికి ఉపాధి కల్పించడమే కాదు రెండు చేతులా సంపాదిస్తున్నారు. నాటి బాధలన్నీ దూరం చేసుకుంటూ ఒక్కోమెట్టు ఎదుగుతూ ఆర్థిక స్థిరత్వం సాధిస్తూ, బతుకుదిద్దిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చాటుతున్నారు.
– రాజన్న సిరిసిల్ల, జూన్ 26 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్
రాజన్న సిరిసిల్ల, జూన్ 26 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్: దళిత బంధు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడుతగా 206 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ ప్రభుత్వం 20.60కోట్లు ఇచ్చింది. పథకం కింద చాలా జిల్లాల్లో కార్లు, వివిధ పరికరాలు కొనుగోలు చేయగా, జిల్లాలో వ్యాపారాలు పెట్టుకోవాలని లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. రామన్న సూచన మేరకు అందరూ కొత్తకొత్త వ్యాపారాలు మొదలు పెట్టి లాభాలు గడిస్తున్నారు. వీరికి అధికారులు అండగా ఉండి, వ్యాపారంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో కొంత మంది లబ్ధిదారులు కలిసి రూ.2కోట్లతో రైస్‌మిల్లు, తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో రూ.26లక్షలతో ఇద్దరు లబ్ధిదారులు పౌల్ట్రీ ఫాం, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో పది మంది డెయిరీ ఫాం, మరో పది మంది మినీ పుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు, దాల్, ఆయిల్ మిల్లులు, టైల్స్ దుకాణాలు పెట్టుకుని లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. కాగా, ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో 18 మందికి దళిత బంధు పథకం కింద 10 లక్షల చొప్పున 1.80కోట్లు ఇవ్వగా, అందులో తొమ్మిది మంది మహిళా లబ్ధిదారులు ఉన్నారు. తొమ్మిది మంది కలిసి హరిదాస్‌నగర్‌లో కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై 1.50కోట్లతో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరికి మంజూరైన 90లక్షలు పోను మిగిలినవి బ్యాంకులోన్ తీసుకున్నారు. బంక్ నిర్మాణ పనులు సైతం సొంతంగానే చేసుకుంటున్నారు. నెలరోజుల్లో బంక్‌ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేలా చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర సర్కారు అన్ని వర్గాల సంక్షేమం కోరుతూ కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నది. ‘దళిత బంధు’ పథకం దళితుల సరికొత్త జీవితాలకు బాటలు వేసింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నాడు కూలీలుగా పనిచేసినోళ్లు నేడు యజమానులయ్యారు. కుటుంబానికి ఇచ్చిన 10లక్షలు వృథా చేయకుండా వివిధ వ్యాపారాలు పెట్టుకుని మెరుగైన జీవనం గడుపుతున్నారు. సర్కారు చేసిన ఆర్థిక సాయంతో కుటుంబం ఉపాధి పొందుతూ పది మందికి పనికల్పించే స్థాయికి ఎదిగేలా చేసింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌తోనే మాబతుకులు మారాయన్న సంతోషం దళితుల కండ్లలో కనిపిస్తున్నది.
సార్ దయతోనే యజమానులైతున్నం..
నా పేరు తెడ్డు ఎల్లవ్వ, మాది ఎల్లారెడ్డిపేట మండలం పదిర. నా భర్త భూమ రాజయ్య. మాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. తాతల కాలం నుంచి మేమంతా కూలీలుగానే మిగిలిపోయినం. బిడ్డలు, కొడుకులు అందరూ సదువుకు దూరమైన్రు. ఏ పని దొరికితే ఆ పని చేస్తనే ఇల్లు గడుస్తది. గతంల ఎవరూ మమ్మల్ని పట్టించుకోలె. ఎక్కడున్నమో గక్కన్నే ఉన్నం. తెలంగాణ వత్తే కొంచమైనా మారుతుందనుకున్నం. కేసీఆర్ సార్ దళితులకు మూడెకరాల భూమి ఇత్తమంటే ఉత్తమాటలే అనుకున్నం. సార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నడు. ఎవలకో కాదు మాసుట్టాలకే మూడెకరాల భూమి అచ్చింది. ఇక మాకు దళిత బంధు పథకం కింద 10లక్షలు వచ్చినయి. మా ఊరిలో 18 మందికి వచ్చినయ్. కొందరు కిరాణా దుకాణాలు, సూపర్మార్కెట్లు పెట్టుకున్నరు. మేం తొమ్మిది మంది బాగా ఆలోచించి పెట్రోల్ బంక్ పెట్టుకుంటమని కేటీఆర్ సార్‌కు చెప్పినం. సార్ సరేనని అధికారులకు చెప్పి లైసెన్సులు ఇప్పించిండు. కోటిన్నర అయితదని అన్నరు. మా సుట్టపోళ్లు, మాకు ఇచ్చిన 90లక్షలు పోను మిగిలిన పైసలు బ్యాంకుల లోన్ తీసుకున్నం. హరిదాస్‌నగర్ రోడ్డులో 18గుంటల జాగా కిరాయికి తీసుకుని బంకు పెడుతున్నం. నెలరోజుల్లో చాలు జెయ్యాలనుకుంటున్నం. ఇన్నేళ్లకు సీఎం కేసీఆర్, మా రామన్న కేటీఆర్‌లు జెయ్యవట్టి మేము యజమానులం కావాలన్న కోరిక నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెట్రోలు బంకులు పెద్దపెద్దోళ్లే పెట్టుకుంటరట. మాకు గింత పెద్ద అవకాశం కల్పించి మాకు దారిసూపిన సారుకు జన్మలో మరిచిపోం.
ఏ జన్మల పుణ్యం చేసుకున్నమో..
నా పేరు తెడ్డు దేవేంద్ర. మాది ఎల్లారెడ్డిపేట మండలం. పదిర. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. నేను వ్యవసాయ కూలీ పనికి పోతుంటా. మా అమ్మ, నాన్నలు కూలీ పనే చేసే నన్ను పెంచి పెద్ద చేసిన్రు. ఆనాడు రైతులను చూసి మనమెప్పుడు యజమానులమైతమే అని నుంచే అమ్మతో అనేదాన్ని. ‘ఆ అదృష్టం మనకెక్కడిది బిడ్డా. మా తాతలు ముత్తాతలంతా గిదే కూలీపనిచేసిండ్రట. మనం కూడా గిట్లనే కూలీ పనిచేయ్యాలే. మన రాతలే గిట్టున్నదని’ అంటుండె. ఏ జన్మల పుణ్యం చేసుకున్నమో గానీ సీఎం కేసీఆర్ సార్ జెయ్యవట్టి మాకు దళిత బంధు కింద రూ.10లక్షలు వచ్చినయ్. ఎకరం భూమి కొందామన్న పైసలు సరిపోవన్నరు. మా ఊళ్లే 18 మందికి వచ్చినయ్. తొమ్మిది మంది కలిసినం. పెట్రోలు బంక్ పెట్టుకుందామన్నరు. చాలా సంతోషమనిపించింది. బంక్ తయారైంది. బంక్ నిర్మాణ పనులన్నీ సొంతంగా మేమే చేసుకుంటున్నం. యజమానులవుతున్నామన్న నా కోరిక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లు నెరవేరుస్తుండ్రు. వారికి జీవింతాంతం రుణపడి ఉంటం. అందరం పార్ట్నర్లం కలిసి మంచిగ నడిపించుకుంటం. సార్పేరు నిలబెడుతం. మా ఊరికి మంచి పేరుతెస్తం.
పౌల్ట్రీ ఫాంకు ఓనరైన
నాపేరు చెదల సుమన్. మా ఊరు గండిలచ్చపేట, తంగళ్లపల్లి మండలం. నేను ఉన్నత చదువులు చదివిన. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న. ఇప్పటికే పలు కంపెనీలు మారిన. ఉద్యోగ భద్రత లేని ప్రైవేటు జాబ్‌తో చాలా ఇబ్బందులు పడ్డ. కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో దరఖాస్తు చేసుకున్న. రూ.10లక్షలు వచ్చినయి. నేను ఇంకో లబ్ధిదారుడు కలిసి మొత్తం రూ.26లక్షల పెట్టుబడితో పౌల్ట్రీ ఫాం పెట్టుకున్నం. మంత్రి కేటీఆర్ సార్ చేతులమీదుగా ప్రారంభించినం. వ్యాపారంలో అనుభవం లేదు. మొదటి దఫా కోళ్లను అమ్మితే రూ.80వేల లాభం వచ్చింది. మా కుటుంబ సభ్యులందరం కలిసి సొంతంగా పనిచేసుకుంటున్నం. ఏ కంపెనీలో పనిచేసినా ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దయతో గుమాస్తా నుంచి ఓనరైన. అసలు నా అదృష్టం ఇలా కలిసి వస్తుందనుకోలేదు. దళితబంధు మాకు దారి చూపింది. ఆత్మగౌరవం పెంచిన సీఎం, మంత్రికి కృతజ్ఞతలు.