గురువారం 03 డిసెంబర్ 2020
Karimnagar - Oct 25, 2020 , 04:45:09

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

గన్నేరువరం : మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు తీరొక్క పూలను సేకరించి పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి ‘రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో’ అనే పాటలతో గౌరమ్మను పూజించారు. సత్తు పిండి నైవేద్యాలు సమర్పించి వెళ్లిరావమ్మా అని గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. మండలంలోని మాదాపూర్‌, జంగపెల్లి, గునుకులకొండాపూర్‌, గన్నేరువరంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌లలోని విగ్రహాల వద్ద హైమాస్ట్‌ లైట్ల వెలుతురులో బతుకమ్మ ఆడారు. నిమజ్జనానికి సర్పంచులు ప్రత్యేక లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ ఆవుల తిరుపతి పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు పాల్గొన్నారు.

చిగురుమామిడి: మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపుకొన్నారు. ఎంపీపీ కొత్త వినీత, సర్పంచులు పిట్టల రజిత, చెప్యాల మమత, వకుళ, అందె స్వరూప, లీల, మాధవి, అమూల్య, భవాని మహిళతో కలిసి బతుకమ్మ ఆడారు. సర్పంచులు సన్నీల వెంకటేశం, పిట్టల రజిత, కానుగంటి భూమిరెడ్డి, ముప్పిడి నరసింహారెడ్డి, పెద్దపెల్లి భవాని, సుద్దాల ప్రవీణ్‌, శ్రీమూర్తి రమేశ్‌, బెజ్జెంకి లక్ష్మణ్‌  పాల్గొన్నారు. ఎస్‌ఐ చల్లా మధుకర్‌రెడ్డి మండలంలో పెట్రోలింగ్‌ నిర్వహించారు.

మానకొండూర్‌: సద్దుల బతుకమ్మ వేడుకలను శనివారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలు సాయంత్రం ఆటపాటలతో అలరించారు. అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.  మండల కేంద్రంలో చెరువుకట్టవద్ద, తూర్పు దర్వాజ, వేంకటేశ్వర ఆలయం, గడిమహల్‌, నెల్లివాడ, గణేశ్‌నగర్‌, ఆదర్శనగర్‌, రాజీవ్‌నగర్‌, సంజీవ్‌నగర్‌ కాలనీలో బతుకమ్మ వేడుకలు కొవిడ్‌  నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. 

తిమ్మాపూర్‌ రూరల్‌: మండలంలో బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలు ఘనంగా జరుపుకొన్నారు. బతుకమ్మ పాటలు, కోలాటాలతో యువతులు హోరెత్తించారు. పసుపు, కుంకుమలు వాయినాలు ఇచ్చుకున్నారు.అనంతరం కుంటలు, చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

మానకొండూర్‌ రూరల్‌: మండలంలోని ముంజంపల్లి, మద్దికుంట, చెంజర్ల, కొండపల్కల, గంగిపల్లి, వేగురుపల్లి, పచ్చునూర్‌, జగ్గయ్యపల్లి, వెల్ది, పలు గ్రామాల్లో శనివారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చారు. వాయినాలు తీసుకొని, వెంట తెచ్చిన ప్రసాదాలను పంపిణీ చేశారు. బతుకమ్మ ఆడుతున్న ప్రాంతాల్లో సీఐ సంతోష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 

శంకరపట్నం: మండలంలోని అన్ని గ్రామాలలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో మహిళలు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. యువతులు దాండియా ఆడారు. అనంతరం సమీపంలోని జలాశయాల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

తిమ్మాపూర్‌: మండలంలో అన్ని గ్రామాల్లో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూర్‌తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళా ప్రజాప్రతినిధులు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 


తాజావార్తలు