Dharmaram | ధర్మారం,మే31: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం చింత చెట్టు వృక్షం పడి రెండు జీపులు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు రూ.10 లక్షల వరకు వాహనాల ధ్వంసంతో నష్టం జరగగా డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం ఆర్టీసీ బస్టాండ్ సమీపం ధర్మారం నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ప్రతీరోజు జీపులను నడిపి డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు.
ఈ క్రమంలో బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన రెడపాక లక్ష్మణ్, నంది మేడారం గ్రామానికి చెందిన మాదాసి తిరుపతి అనే డ్రైవర్లు తమ జీపులను ఉదయం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిలిపారు. దీంతో ఎన్నో ఏళ్ల నాటి చింత మానువృక్షం అకస్మాత్తుగా అట్టి వాహనాలపై పడడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యయి. ఆ సమయంలో జీపులలో ఆ ఇద్దరు డ్రైవర్లు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కొద్దిపాటి క్షణాలలో ఆర్టీసీ బస్సు కూడా ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
జీపుల ధ్వంసం వలన తాము పూర్తిస్థాయి ఉపాధి కోల్పోయామని నిరాశ్రయు లైనామని, ఒక్కో వాహనానికి రూ.5 లక్షల చొప్పున రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకొని తమకు న్యాయం చేయాలని బాధిత డ్రైవర్లు లక్ష్మణ్, తిరుపతి కోరారు.