రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సర్ధాపూర్‌లోని 17వ బెటాలియన్ పోలీసులు మళ్లీ ఆందోళనకు దిగారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల కింద ఆందోళన చేసిన పోలీసులలో ఆరుగురిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం రోడ్డెక్కారు. వంద మందికిపైగా పోలీసు సిబ్బంది బెటాలియన్ ఆవరణలోని కమాండెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వెట్టి చాకిరి చేయిస్తున్న కమాండెంట్ మాకొద్దని, ఆయన పాలనకు చరమగీతం పాడాలని, తమకు న్యాయం చేయాలని నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్ విధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా సిరిసిల్ల బెటాలియన్‌లోనే తాము ఆందోళన చేశామన్నారు. బయటకు రాకుండా తమ పరిధిలోనే ఆందోళన చేశామని, మీడియా ముందు తమ బాధలు చెప్పుకున్న పాపానికి తమ సహోద్యోగులైన ఆరుగురిని సస్పెండ్ చేశారన్నారు. తమ బాధలు చెప్పుకోవడం నేరమా అంటూ ప్రశ్నించారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని, లేదా మా అందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కమాండెంట్ బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. గంట పాటు నిరసన, ఆందోళన చేసినా కమాండెంట్ బయటకు రాలేదు. వీరు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ కృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని సైతం బెటాలియన్లోకి అనుమతించలేదు. ఆరుగురు ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. కాగా, రెండ్రోజుల కింద తమ భార్య, పిల్లలు కుటుంబాలతో వచ్చి సిరిసిల్ల పట్టణంలో ఆందోళన చేశారని, వారందరినీ కౌన్సెలింగ్ పేరిట బెటాలియన్లోకి తీసుకొచ్చి కమాండెంట్ అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారు. ‘మీ భర్తల డ్యూటీలు ఇలాగే ఉంటాయని తెలువదా? మీరెందుకు పోలీసులను పెళ్లి చేసుకున్నారంటూ’ అన్నారని, కమాండెంట్ మాట్లాడే పద్ధతి ఇదేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాము పోలీసులమే కానీ కూలీలకన్నా అధ్వానంగా తమతో కమాండెంట్ వెట్టిచాకిరి చేయిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాహనాలలో రాత్రి వేళలో మానేరు నుంచి ఇసుక రవాణా చేయిస్తున్నారని, బయట మిషన్ భగీరథ పైపులు మోయిస్తున్నాడని ఆరోపించారు. కూలీల కన్నా అధ్వానంగా తమతోనే కందకాలు తవ్వించడం, రోడ్లు వేయించడం లాంటి పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెక్కడన్నా ఉద్యోగం చేస్తాం కానీ, ఈ కమాండెంట్ వద్ద పనిచేయలేమంటూ స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది చేసిన ఆరోపణలపై కమాండెంట్‌ను వివరణ కోరేందుకు వెళ్లిన విలేకరులను కూడా బెటాలియన్ పోలీసులు అనుమతించ లేదు.
పోలీసుల సస్పెండ్‌ను ఎత్తివేయాలని కోరుతూ 17వ బెటాలియన్ పోలీసులు ఆదివారం రాత్రి సిరిసిల్లలో కొవ్వొత్తులతో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి గాంధీ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చేస్తున్న న్యాయమైన విజ్ఞప్తుల వెనుక ఏరాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా 39 మందిని సస్పెండ్ చేశారని, వారందరినీ తిరిగి విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల బెటాలియన్ పరిధిలో ఆరుగురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.