e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home కరీంనగర్ పేదలపై ప్రేముంటే ఇండ్లెందుకు కట్టియ్యలె?

పేదలపై ప్రేముంటే ఇండ్లెందుకు కట్టియ్యలె?

అధికారంలో ఉండి పని చేయని వ్యక్తి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తడు?
ఇన్నాళ్లూ నియోజకవర్గాన్ని పట్టించుకున్నడా?
రాజేందర్‌ను ఇంకా నమ్మితే మరింత వెనుకబాటు
బీజేపీతో ప్రభుత్వరంగ సంస్థలన్నీ నిర్వీర్యం
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌
కమలాపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం
పేదోళ్లకు ఈటల ఏం చేసిండు..? : పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి
తగిన గుణపాఠం చెప్పాలి : మాజీ మంత్రి పెద్దిరెడ్డి

కమలాపూర్‌, అక్టోబర్‌ 16 : బీజేపీ నేత రాజేందర్‌కు పేదలపై ప్రేమ ఉంటే ఇండ్లు ఎందుకు కట్టించలేదో చెప్పాలి. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ నాలుగు వేల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరు చేస్తే, కనీసం ఒక్క ఇల్లయినా కట్టిండా? పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు. ఐదేండ్లు సేవ చేయాలని ఓటేస్తే, చేతకాక రాజీనామా చేసిండు. అధికారంలో ఉండి పనిచేయని వ్యక్తి.. రేపు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఏం చేస్తడో ప్రజలు అడగాలి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేసిండు.. అభివృద్ధిని మరిచిండు. ఆస్తులను సంపాదించుకొని.. ఇయ్యాల వాటిని కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నడు. ఆయనను మరోసారి నమ్మితే మరింత వెనుకబడుతం. మీరే ఆలోచించండి. హుజూరాబాద్‌ అభివృద్ధి కోసం మంచి నిర్ణయం తీసుకోండి. పేదింటి బిడ్డనైన నాకు మీ దీవెనలు ఇవ్వండి.

- Advertisement -

ఈటల రాజేందర్‌కు పేదలపై ప్రేమ ఉంటే అవకాశం ఉన్నా ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టియ్యలేదని టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ప్రశ్నించారు. కమలాపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మే బీజేపీ కావాలో, రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూ.. ప్రజలకు సంక్షేమాన్ని అందించే టీఆర్‌ఎస్‌ వైపు నిలబడతారో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన బీజేపీ, ఈ ఏడేండ్లలో కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గ్యాస్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా, ఆదిశగా పట్టించుకోవడం లేదన్నారు. ఇక ఆ పార్టీ లో ఉండి ఈటల ప్రజలకు ఏం చేస్తడని ప్రశ్నించారు. నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ నాలుగు వేల డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరు చేస్తే, కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదని విమర్శించారు. ఐదేండ్లు సేవ చేయాలని ఓటేస్తే, చేతగాక రాజీనామా చేసిండని మండిపడ్డారు. పేదలకు సేవ చేసే అవకాశాన్ని పేదోడికి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు మీరంతా అండగా నిలవాలని కోరారు. 30న జరిగే ఎన్నికలో కారుగుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.

పేదోళ్లకు ఈటల ఏం చేసిండు..?: ఎమ్మెల్యే ధర్మారెడ్డి
పేదలకు ఈటల చేసిన మంచి పనులు ఏమిటో చెప్పాలని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రశ్నించారు. రైతు వ్యతిరేక పార్టీలో చేరి, గెలిచేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. దొడ్డు వడ్లు కొనమంటున్న బీజేపీకి ఓటెందుకు వేయాలో రైతులు, ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే, కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రైతు వ్యతిరేక బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. నల్ల చట్టాలను వ్యతిరేకించిన ఈటల ఇవాళ అదే పార్టీలో ఎందుకు చేరిండో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

తగిన గుణపాఠం చెప్పాలి: పెద్దిరెడ్డి
టీఆర్‌ఎస్‌తోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాకే 24 గంటల కరంటు, రైతు బంధు లాంటి పథకాల ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతున్నదన్నారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయిస్తానని ఈటల చెప్పగలడా అని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి పేరియాల రవీందర్‌రావు, సర్పంచ్‌లు మాట్ల రవీందర్‌, రవీందర్‌రెడ్డి, దాసరి రమేశ్‌, వనిత, ఎంపీటీసీ శైలజ, సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, డైరెక్టర్‌ సత్యనారాయణరావు, నాయకులు సుందర్‌రాజ్‌యాదవ్‌, ఇంద్రసేన, నాగేందర్‌ ఉన్నారు.

గెల్లు వెంటే జనం..
కమలాపూర్‌/కమలాపూర్‌ రూరల్‌, అక్టోబర్‌ 16: టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు జేజేలు పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పడుతున్నారు. శనివారం కమలాపూర్‌ మండలం శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజ్‌పల్లి, లక్ష్మీపూర్‌, శనిగరం గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి గెల్లు రోడ్‌షోతోపాటు ఇంటింటా ప్రచారం చేయగా, ఆయాచోట్ల గ్రామస్తులు పెద్దసంఖ్యలో గెల్లు వెంటే కదిలారు. డప్పుచప్పుళ్ల మధ్య రాలీ తీశారు. మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. ‘మా ఓటు నీకే’ అంటూ ఆశీర్వదించారు. కానిపర్తిలో గెల్లుకు యాదవులు గొర్రె పిల్లను బహూకరించి, సన్మానించారు. దళిత కాలనీల్లో దళితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆహ్వానించారు. ఆయనవెంట మండల ఇన్‌చార్జి పేరియాల రవీందర్‌రావు, సర్పంచ్‌లు మాట్ల రవీందర్‌, రవీందర్‌రెడ్డి, దాసరి రమేశ్‌, చెరిపెల్లి వనిత, ఎంపీటీసీ పసరగొండ శైలజ, సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, డైరెక్టర్‌ సత్యనారాయణరావు, నాయకులు సుందర్‌రాజ్‌యాదవ్‌, ఇంద్రసేన, నాగేందర్‌, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement