ఇన్నేండ్ల పాలనలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా..?
ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలి
గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంటలో టీఆర్ఎస్ యూత్ నాయకులతో సమావేశం
జమ్మికుంట రూరల్, అక్టోబర్ 16: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతకు తీరని అన్యాయం చేసిందని, ఇన్నేండ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణతో ఉన్న కొలువులు ఊడగొడుతున్నదని, వచ్చే ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో తెలంగాణ విద్యార్థి, యూత్ టీఆర్ఎస్ విభాగ కార్యకర్తలతో సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం 50మంది యువత బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు, యువత సైనికుల్లా పని చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. ఇన్నేండ్ల పాలనలో హుజూరాబాద్‌కు ఈటల చేసిందేమీ లేదని, పైగా తన స్వార్థం కోసం రాజీనామా చేసి ఎన్నిక తెచ్చారని మండిపడ్డారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. పార్టీకి యువతే వెన్నుముక అని, వార్డుల్లో ప్రభుత్వ పని తీరుపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి, వార్డు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్యతో పాటు టీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.