సంబురంగా తరలిన దళితబిడ్డలు
ఊళ్లకు ఊళ్లే శాలపల్లి-ఇందిరానగర్‌కు..
వాహనాలకు ప్రత్యేక అలంకరణ
హుజూరాబాద్‌టౌన్/ హుజూరాబాద్ రూరల్/హుజూరాబాద్ చౌరస్తా/ వీణవంక/ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్/ జమ్మికుంట/ జమ్మికుంట చౌరస్తా/ కమలాపూర్, ఆగస్టు 16: దళితలోకం కదిలింది. శాలపల్లి, ఇందిరానగర్ వేదికగా చారిత్రాత్మక దళిత బంధు అమలుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతుండడంతో ఉత్సాహంగా తరలింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ఇంటిల్లిపాది సంబురంగా బస్సుల్లో పయనమయ్యారు. నియోజకవర్గంలోని ఏ దారి చూసినా వాహనాల సందడే కనిపించింది. ఇన్నాళ్లూ దగాపడ్డ తమ బతుకులు మార్చే గొప్ప పథకం ప్రారంభోత్సవం కావడంతో తప్పనిసరిగా వెళ్లాలన్న ఉత్సాహంతో ముందురోజే నిర్ణయించుకుని, ఆ మేరకు ప్రజానీకం సిద్ధమైంది. ఇంటి ముంగిళ్లను రంగు రంగుల ముగ్గులతో అలంకరించింది. ‘కేసీఆర్‌కు స్వాగతం’ పలుకుతూ ముఖ్యమంత్రి, కారుగుర్తు బొమ్మలను వేసి అభిమానం చాటుకున్నది. ఇంటికి తోరణాలు కట్టి ముస్తాబు చేసుకున్నది. వంటలు చేసుకుని, సద్దులు కట్టుకుని ఇంటిల్లిపాది సంబురంగా కదిలింది. తమ వాడలకు వచ్చిన బస్సులను అందంగా అలంకరించారు. తమ ఆత్మ‘బంధు’వు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలను కట్టి, దండలు వేసి పాలాభిషేకాలు చేశారు. నియోజకవర్గంతో పాటు కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి 825 బస్సులు, వేలాది ప్రత్యేక వాహనాల్లో సభవైపు కదిలారు.
ఇల్లందకుంట మండలంలోని దళితవాడలకు 110 బస్సులు కేటాయించగా.. 10 వేలకుపైగా జనం తరలివెళ్లారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు వారితో బస్సులో కలిసి సంతోషంగా కదిలారు. హుజూరాబాద్ మండల కేంద్రంలోని దళితవాడలకు 240 బస్సులు కేటాయించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సభకు 14 వేల మందికి పైగా కదిలారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డప్పుతో దరువేయగా, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి స్థానికులతో కలిసి నృత్యం చేశారు. కమలాపూర్ మండలంలోని దళితవాడల నుంచి 120 బస్సులతోపాటు ప్రైవేట్ వాహనాల్లో దాదాపు 20 వేలకుపైగా జనం తరలివెళ్లారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దళిత సోదరులతో బస్సులో సంబురంగా మాటా ముచ్చట పెట్టుకుంటూ వెళ్లారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. దారి పొడవునా డప్పుచప్పుళ్లు, నృత్యాలతో కళాకారులు హోరెత్తించారు.