హుజూరాబాద్, ఆగస్టు 16;దళితవాడకు పండుగొచ్చింది. దళితలోకం మురిసింది. విప్లవాత్మక .. దళితజీవితాల్లో వెలుగులు నింపే మహత్తర పథకానికి పునాది పడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఊరూరా ఆడబిడ్డ సంబురపడగా, ఇంటింటా సందడి కనిపించింది. ఇంటిల్లిపాది ఉదయాన్నే లేచి.. తమ ఊళ్లూ.. కాలనీలే కాదు తమ ఇండ్లనూ అందంగా అలంకరించుకున్నది. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడంతోపాటు వాకిళ్లలో అందమైన రంగులు వేసి పథకానికి స్వాగతం పలుకుతూనే.. సీఎం కేసీఆర్కు వినూత్నంగా కృతజ్ఞతలు చాటింది. దళిత బాంధవుడు.. ఆత్మబంధువు కేసీఆర్ అంటూ కీర్తించింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే చారిత్రక దళిత బంధు పథకానికి పునాది పడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దళిత వాడలు మెరిసిపోగా, బిడ్డలు మురిసిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిని సుందరంగా అలంకరించుకున్నారు. తమ నివాసాల ముందు రంగవల్లులు వేసి.. దళిత బంధు అని చక్కగా రంగులు వేశారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ అని పదాలతో ముగ్గులు వేసి.. గులాబీ పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి ఇంటి గుమ్మానికీ మామిడి తోరణాలు కట్టి సంబురాలు జరుపుకున్నారు. తమ ఇండ్లనే కాదు పలుచోట్ల తమ కాలనీలను దళితులు అందంగా అలంకరించుకొని, దళిత బంధుకు స్వాగతం పలికారు.
సంతోషంగా సభకు..
కొత్త బట్టలు ధరించారు. ఇంట్లో దేవుడికి కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. పిల్లాజెల్లాను సిద్ధం చేశారు. ఎన్ని పనులు ఉన్నా వదులుకొని అంతా కలిసి సీఎం కేసీఆర్ సభకు తరలివెళ్లారు. కేసీఆర్ మా దేవుడు అంటూ కీర్తించారు. ఇక తమ జీవితాలు బాగుపడ్డట్టే అని, ఇది నిజంగా పండుగరోజే అంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ కనిపించారు.
పేదల బతుకులు మంచిగైతయ్
దళితులకు మంచి చేసేందుకు గతంలో ఏ ఒక్కలూ ముందుకు రాలె. అసలు మమ్మల్ని ఓట్ల కోసమే చూసినోళ్లు ఉన్నరు. ఇయ్యాల కేసీఆర్ సారు మా జీవితాల్లో వెలుగులు నింపుతనని అంటున్నడు. దళిత బంధు పెట్టి ఇంటికి పది లక్షలు ఇస్తనన్నడు. దేశంల ఇప్పటిదాకా ఇసొంటి పథకమే లేదని, మన జీవితాలు బాగుపడతయని మా కులపోళ్లు అంటున్నరు. అందుకే పొద్దుగాల్నే సీఎం కేసీఆర్ సారు సభకు బయల్దేరిన. ఇసొంటి మంచి పథకాన్ని ప్రారంభిస్తున్న ఆయనను చూడాల్ననే ఈ సభకు పోతున్న. కేసీఆర్ సారుకు జై కొట్టి అండగా నిలుస్త. మా బతుకులు బాగు చేస్తనని చెబుతున్న ఆయనకు రుణపడి ఉంటం
-రౌతు సునీత, గండ్రపల్లి, జమ్మికుంట
సీఎం సారే మా దేవుడు..
ముఖ్యమంత్రి కేసీఆర్ సారే మా దేవుడు. ఆయన వెంటే మేముంటం. మా కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి మా బతుకులకు భరోసానిచ్చిండు. ఇప్పటిదాకా మా దళితుల గురించి ఎవరూ పట్టించుకోలే. ఎందరో నాయకులు అదిచేస్తం. ఇది చేస్తామంటూ చెప్పి గెలిచిన్రు. గెలిచినంక మా దిక్కు చూసినోళ్లే లేరు. ఇన్నాళ్లకు దళితులు అభివృద్ధి చెందేందుకు ఓ మంచి పథకం వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకొని మా బతుకులను మార్చుకుంటం. సీఎం సారే మా దేవుడు.. ఆయన వెంటే నడుస్తం.
-అంబాల సంధ్య, రాజుపల్లి గ్రామం (హుజూరాబాద్ మండలం)