ఒకే రోజు రూ.50 లక్షల చెక్కుల పంపిణీ
ఆదర్శంగా నిలుస్తున్న పోతుగల్ సహకార సంఘం
ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్న పాలకవర్గం
చైర్మన్ తన్నీరు బాపురావు
ముస్తాబాద్, డిసెంబర్ 15: పోతుగల్ సహకార సంఘం ఉమ్మడి జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. ఒకటి రెండు కాదు. వివిధ రంగాల్లో రైతులకు అండగా నిలుస్తున్నది. ఒక వైపు పాడి పరిశ్రమ, మరోవైపు గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూనే ఇంకోవైపు పెద్ద మొత్తంలో ధాన్యం సేకరణ, ధాన్యం నిల్వలకు గోదాముల నిర్మాణం చేపడుతూ.. విభిన్న అంశాల్లో ముందుకు దూసుకెళ్తున్నది. అంతటితో ఆగకుండా త్వరలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఏర్పాటు చేసేందుకు పాలకవర్గం సన్నాహాలు చేస్తుండగా బుధవారం ఒక్కరోజే..రూ.50 లక్షల చెక్కులను పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం కోసం అందించి ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచింది. సంఘం పరిధిలోని పోతుగల్, ఆవునూర్, తుర్కపల్లి, రామలక్ష్మణులపల్లె, గన్నెవానిపల్లె, కొండాపూర్, గూడూర్, మద్దికుంట కొనుగోలు కేంద్రాల ద్వారా 1861 మంది రైతుల నుంచి రూ.20 కోట్ల విలువైన 1.4 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంకా పలు కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ధాన్యం నిల్వల కోసం ఏ సంఘం ఆలోచించని తరహాలో ముందుకెళ్తున్నది. ఇందుకోసం గూడెం గ్రామంలో నాబార్డు సహకారంతో 160 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం, కమర్షియల్ కాంప్లెక్స్ (మడిగలు) రూ. 26.50 లక్షలతో నిర్మాణం పనులు శరవేగంగా చేపడుతున్నది. సంఘ సేవలను మరింత విస్తృతం చేయాలన్న లక్ష్యంతో సంఘ పాలకవర్గ సమావేశం బుధవారం చైర్మన్ బాపురావు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ తన్నీరు బాపురావు మాట్లాడుతూ.. పోతుగల్ సహకార సంఘం వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య పరంగా పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే సంఘ పరిధిలోని మోహినికుంట, ఆవునూర్ గ్రామాల్లో డీజిల్ అందుబాటులో ఉన్న బంకుల్లో పెట్రోల్ విక్రయాలకు అనుమతులు వస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా రెండు పంపుల్లో చార్జింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంఘం ద్వారా రూ.8.26 కోట్ల పంట రుణాలు, రూ.7.36 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, రూ.70.47 లక్షలు బంగారంపై రు ణాలు, రూ.40 లక్షలు వాహన రుణాలు, రూ.9.41 లక్షలు చిరువ్యాపారులకు, రూ.6.71 లక్షల మార్టిగేజ్ రుణాలను అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పశువులు, గొర్రెల పెంపకానికి 12 మంది రైతులకు మంజూరైన రూ.50 లక్షల చెక్కులను పాలకవర్గం సభ్యులు లబ్ధిదారులకు అందజేశారు. ఒకేరోజు రూ.50లక్షల చెక్కు లు ఇవ్వడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తాము తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు సకాలంలో సంఘానికి రుణాలు చెల్లించి.. మరింత మందికి రుణాలు అందేలా దోహద పడుతామని లబ్ధిదారులు పేర్కొన్నారు.
ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్
విభిన్న రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న సంఘం.. మరో కొత్త అడుగు వేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఇప్పటికే పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తున్న విషయం తెలిసిందే. వీటి అవసరాలను ఇప్పటికే ప్రభుత్వం నొక్కి చెప్పింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సంఘం.. పోతుగల్ గ్రామ పరిధిలో ఎకరం స్థలం కొనుగోలు చేసి రూ.30లక్షలతో ప్రహరీ నిర్మా ణం చేసింది. ఇందులోనే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని పాలకవర్గం నిర్ణయించినట్లు చైర్మన్ తెలిపారు. దీనికి త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయనందున రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో ఇతర పంటల వైపు సాగేలా సంఘం ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం కావాల్సిన ప్రచారం చేస్తున్నది. సంఘం పురోభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి కేటీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుకు పాలకవర్గం సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గ సమావేశంలో వైస్ చైర్మన్ మేర్గు రాజేశంగౌడ్, డైరెక్టర్లు కట్ట బాపురావు, సతీశ్ చందర్రావు, గన్నె నర్సింహులు, కుర్ర కిర్తన్, బాలమల్లు, మల్లవ్వ, బైరి బాలవ్వ సీఈవో కృష్ణ, మేనేజర్ రాజేశ్వర్ రావు, సిబ్బంది శ్వేత, నర్సింహులు, శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.