
కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 15 : దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని విద్యార్థులే కోరుకుంటున్నారని, ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, నిసా జాతీయ సలహాదారు, పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఈ ప్రసాద్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్‌లోని మంకమ్మతోట పారమిత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ట్రస్మా జిల్లా సెక్రటరీ సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ శ్రీపాల్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. కరోనా సమయంలో ‘లర్నింగ్స్, లర్నింగ్ పావర్టీ’ అంశంపై తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా), నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలియన్స్(నిసా) సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సర్వే చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 1502 మంది విద్యార్థులను ఒక ప్రత్యేక ప్రశ్నావళితో కరోనా సమయంలో ఏర్పడిన లర్నింగ్ లాస్, లర్నింగ్ పావర్టీని అంచనా వేశామన్నారు. ఇందులో 3, 5, 8 వ తరగతుల విద్యార్థుల్లో మాతృభాష, ఆంగ్ల భాష, గణితంలో ప్రశ్నలు అడుగుతూ ఆయా రాష్ట్రాల మాతృభాషలో చదవడం, ఆంగ్లభాషలో రాయడం, పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకొని జవాబులు ఇవ్వడంలో నైపుణ్యాలను అంచనా వేశామని చెప్పారు. ఈ సర్వేలో వెల్లడైన అంశాలను వారు వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో విద్యార్థులపై పెరిగిందని, ఈ క్రమంలో వారు తీవ్ర నిస్పృహకు లోనయ్యారని గుర్తించినట్లు తెలిపారు. చాలా కాలంగా ఇంటికే పరిమితమవడం వల్ల ఇంటి వాతావరణం కూడా తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని విద్యార్థులు అభిప్రాయపడినట్లు చెప్పారు. ఈ నివేదికను రాష్ట్రపతితో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తామని, అందరి సహకారంతో నూతన విద్యా వ్యవస్థ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్వే నివేదికను విడుదల చేశారు.