కార్పొరేషన్, డిసెంబర్ 15 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన రవీందర్‌సింగ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే, తన డివిజన్ ప్రజలు మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం ఉంటే టీఆర్ఎస్ ద్వారా గెలిచిన కార్పొరేటర్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని నగర మేయర్ వై సునీల్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయకుండా.. తనకు 230 మంది ప్రజాప్రతినిధులు ఓట్లు వేశారని చెప్పుకుంటూ కప్పదాటు మాటలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసేందుకు ఫోన్ డబ్బాలు, డబ్బులు తీసుకపోయిన వీడియో, ఫొటోలతో సహా తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. తమ సభ్యులందరు ఒకదగ్గర ఉండాలన్న ఆలోచనతో క్యాంపునకు వెళ్తే అతనికి వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగిన రవీందర్‌సింగ్ ఏ పార్టీ నుంచి పోటీ చేశారని ప్రశ్నించారు. కరీంనగర్, ఆదిలాబాద్‌లో తాము అభ్యర్థులను నిలబెట్టామని హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించిన విషయం కూడా రవీందర్‌సింగ్‌కు తెలియకపోవడం మూర్ఖత్వమని విమర్శించారు.
టీఆర్ఎస్లో ఉండి మేయర్ పదవి అనుభవించిన ఆయన గతాన్ని మరిచిపోవద్దని, ఆ సమయంలో చేసినవన్నీ రికార్డు అయి ఉంటాయని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఉన్న సభ్యుల కంటే అధికంగా ఓట్లు వచ్చాయని, అయినా ఇంకా ఏవో కాకమ్మ కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అనైతిక, అపవిత్ర పొత్తుతో పోటీ చేసినా 230 ఓట్లు దాటలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ వల్లే ఆయనకు గుర్తింపు వచ్చిందని, లేకపోతే ఆయన ఎక్కడ ఉండేవాడో గుర్తు చేసుకోవాలని హితవుపలికారు. ఇక ఆయనకు రాజకీయంలో భవిష్యత్తు లేదని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. పార్టీ టిక్కెట్టుపై గెలిచి ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హితవుపలికారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయకపోతే ఆయనకు ఆ డివిజన్ ప్రజలపై నమ్మకం, విశ్వాసం లేదని తెలిసిపోతుందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, మాధవి, బుచ్చిరెడ్డి, రమణారావు, నాయకులు చల్ల హరిశంకర్, లెక్కల వేణు, అర్ష మల్లేశం, నరేందర్ పాల్గొన్నారు.