ఈ నెల 9నే షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
16 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ
24న పరిశీలన.. 26 వరకు ఉపసంహరణ గడువు
డిసెంబర్ 10న పోలింగ్ l14న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి
కరీంనగర్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2015 డిసెంబర్లో ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల కోటాలో నారదాసు లక్ష్మణ్‌రావు, టీ భానుప్రసాదరావు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా పోటీకి పలువురు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ చివరికి అందరూ పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్కు చెందిన వీరిద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగుస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయగా, మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయిన మరుక్షణం నుంచే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది.
పాత ఉమ్మడి జిల్లాయే ప్రాతిపదిక
పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతిపదికగా ఈ ఎన్నికలు జరుగనున్నాయి. 2016లో జిల్లా పునర్విభజన జరిగిన విషయం తెలిసిందే. దీంతో పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాలు పక్కనే ఉన్న హనుమకొండ, భూపాల్పల్లి, సిద్దిపేట జిల్లాలకు వెళ్లాయి. ప్రస్తుతం ఆయా జిల్లాల్లోకి వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు స్థానాల్లో ఓటర్లుగా కొనసాగుతారు. నిజానికి జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత చూస్తే.. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కలిపి చూస్తే 1172 మంది ఉన్నారు. అయితే, వివిధ జిల్లాల్లోకి వెళ్లిన మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిపి చూస్తే 1326 ఓటర్లు ఉన్నారు. అంటే, 154 మంది ప్రజాప్రతినిధులు ప్రస్తుతం వేర్వేరు జిల్లాల్లో ఉన్నప్పటికీ, వారి వారి ఓటును మాత్రం ఈ ఎన్నికల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటు హక్కు ఉంటుంది.
గులాబీదే గెలుపు..
ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. దీంతో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సంఖ్యను పరిశీలిస్తే.. సుమారు 80 శాతానికిపైగా టీఆర్ఎస్ గుర్తుపై గెలిచారు. అంతేకాదు.. వేర్వేరు పార్టీలపై గెలిచిన వారు సైతం కాలక్రమేణా.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అకర్షితులై.. టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, బీజేపీతోపాటు ఏ పార్టీ కూడా టీఆర్ఎస్కు దరిదాపుల్లోకూడా లేదు. గులాబీ అభ్యర్థుల విజయవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల బరిలో దిగేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.