e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home కరీంనగర్ శుభా(పా)ల పిట్ట!

శుభా(పా)ల పిట్ట!

  • అరుదైన.. అందమైన పక్షి పాలపిట్ట
  • పురాణాల్లోనూ ప్రస్తావన
  • దసరా రోజు చూస్తే ఏడాదంతా మంచే జరుగుతుందనే విశ్వాసం
  • ఐదు రాష్ర్టాలకు అధికారిక పక్షిగా గుర్తింపు
  • ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉనికి
  • రక్షిస్తేనే మేలంటున్న పర్యావరణప్రేమికులు

జగిత్యాల, అక్టోబర్‌ 14( నమస్తే తెలంగాణ) : ప్రకృతిలో పాలపిట్ట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. దసరా రోజు దీనిని దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని విశ్వాసం. దీని వెనుక చిన్నచిన్న పురాణగాధలు ప్రాచూర్యంలో ఉన్నవి. అందులో ఒకటి పాండవులది. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం, అటుపై అజ్ఞాత వాసం ముగించుకుని జమ్మిచెట్టు మీద ఉన్న ఆయుధాలను తీసుకునేందుకు వెళ్తుండగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే పాలపిట్టను చూశారట. కురుక్షేత్ర విజయం అనంతరం రాజ్యాభిషేక ఘట్టంలోనూ ఇది కనిపించిందట. అందుకే పాండవులకు అన్నింటా విజయాలే దక్కాయనీ, విజయాలు వరించడంతో ధర్మరాజు విజయదశమి రోజున పాలపిట్టను దర్శించాలని శాసనం చేసినట్లు చెబుతారు. ఇలానే మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉన్నది. శ్రీమహావిష్ణు రంగు అయిన ముదురు నీలం రంగు అనంతానికి చిహ్నం. అలాంటి వర్ణంలో ఉన్న పాలపిట్టను మహావిష్ణు ప్రతిరూపంగా చెప్పుకుంటారు. ఇక పాలపిట్టను కర్నాటక, కేరళ ప్రాంతాల్లో నీలకంఠిగా వర్ణిస్తుంటారు. నల్లనిది అని అర్థం. మహాశివుడు గరళాన్ని మింగిన సమయంలో విష ప్రభావంతో అతడి గొంతు నీలవర్ణంలోకి మారిపోయిందనీ, అలాంటి నీలివర్ణాన్నే పాలపిట్ట కలిగి ఉందనీ, గరళకంఠుడి రంగును కలిగిఉండడంతో అత్యంత ప్రశస్తమైనదని చెబుతారు.

దసరా రోజు దర్శిస్తే..
పాలపిట్టను తెలుగువారు దసరా రోజు చూడడం వల్ల ఏడాదంతా శుభాలే జరుగుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ రోజు ఉత్తర దిక్కునుంచి వచ్చే పాలపిట్టను చూస్తే మరీ మంచిదని చెబుతుంటారు. అందుకే దసరా రోజు శమీపూజ చేసిన అనంతరం, సాయంత్రం వేళల్లో ప్రజలు పాలపిట్టను దర్శించుకోవడానికి వెళ్తారు. పట్టణ ప్రజలకు దీని గురించి అంతగా తెలియకపోయినా, పల్లెవాసులు మాత్రం గ్రామ శివారు ప్రాంతాలకు వెళ్లి తప్పకుండా దర్శించుకుంటారు. సుమారు 50ఏళ్ల క్రితం వరకు పాలపిట్టను దర్శించుకునేందుకు పురుషులంతా సాయంత్రం సమయంలో అడవిబాట పట్టి, దానిని చూసిన తర్వాతే ఇంటికి తిరిగివచ్చేవారు. ఒక్కోసారి రాత్రి వరకు ఇండ్లకు చేరుకునేవారు.

- Advertisement -

శాస్త్రీయనామం ఇండియన్‌ రోలర్‌..
పాలపిట్ట రోలర్‌ కుటుంబానికి చెందిన పక్షి. దీని శాస్త్రీయనామం ఇండియన్‌ రోలర్‌, దీనినే బ్లూ బర్డ్‌గా కూడా పిలుస్తారు. భారత్‌, ఇరాక్‌, థాయిలాండ్‌ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రహదారులకు ఇరువైపులా ఉండే చెట్లు, విద్యుత్తు స్తంభాలపై ఎక్కువగా కనిపించే ఈ పక్షి గడ్డి భూములు, పొదల్లో సంచరిస్తుంది. ఆహారం కోసం చిన్న చిన్న పాములు, కప్పలు, మిడతలను వేటాడుతుంది. ఆడ, మగ పక్షులు చూడడానికి ఒకే రీతిలో ఉంటాయి. 17 నుంచి 20 ఏళ్లు జీవిస్తాయి. చెట్ల తొర్రల్లో కాపురం పెడుతాయి. ఎంతో అందంగా కనిపించే ఈ పక్షుల అరుపు మాత్రం కాకిని పోలి ఉంటుంది. ప్రత్యుత్పత్తి సమయంలో వీటి అరుపు గోలగోలగా ఉంటుంది. 3 నుంచి 5 గుడ్లు పెడుతాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇవి సమాన బాధ్యతలను స్వీకరిస్తాయి. గుడ్లు పెట్టే పక్షుజాతుల్లో ఆడ పక్షులు మాత్రమే గుడ్లను పొదిగే బాధ్యతను తీసుకుంటాయి. అయితే వీటిలో మాత్రం పురుష పక్షులే గుడ్లను పొదుగుతాయి. ఇవి వలస వెళ్లవు. తాత్కాలికంగా కొద్దిరోజులు మాత్రం తన నివాస ప్రాంతానికి కొద్దిదూరం వరకు వెళ్లి వస్తాయి తప్పా, ఎక్కడికి వెళ్లిపోవు.

ఐదు రాష్ర్టాల్లో అధికారిక పక్షి..
పాలపిట్ట మనదేశంతోపాటు ఇరాక్‌, థాయిలాండ్‌ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పక్షి తలపైభాగం, రెక్కలు లేత నీలం, ముదురు నీలం రంగుల్లో ఉంటాయి. ఇక కాళ్లు, వేళ్లు నలుపురంగులో కనిపిస్తాయి. మెడ భాగం మాత్రం ముదురుగోధుమ రంగులో తెల్లటి గీతలు కనిపిస్తాయి. కన్నడ, మలయాల భాషల్లో నీలకంఠిగా ప్రాచుర్యంలో ఉన్నది. మన తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, ఒడిషా, బీహార్‌ రాష్ర్టాల్లో అధికారిక పక్షిగా వెలుగొందుతున్నది. ప్రత్యేకించి తెలుగురాష్ర్టాల్లో ఈ పక్షికి ప్రజల్లో చెరగని సెంటిమెంట్‌ ఉన్నది. ఎంతో గౌరవిస్తారు. ప్రాణప్రదంగా చూసుకుంటారు.

ప్రమాదపుటంచున ఉనికి..
పాలపిట్ట ఉనికి రోజురోజుకూ ప్రశ్నార్థకంలో పడుతున్నది. మన సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న పాలపిట్టను కొందరు పంజరంలో బంధించి దసరా రోజు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దపెద్ద చెట్ల తొర్రల్లో జీవించే ఈ పక్షులిప్పుడు ఆవాసాలు లేక ప్రమాదంలో పడుతున్నవి. ఫలితంగా వీటి పునరుత్పత్తి దెబ్బతిని, సంఖ్య తగ్గిపోతున్నది. ఎక్కువ కాలం జీవించే చెట్లు లేకపోవడం, ఉన్న చెట్లను విచ్చల విడిగా నరకడమే ఇందుకు ప్రధాన కారణని తెలుస్తున్నది. పాలపిట్టల పరిరక్షణకు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ముందుకు వస్తున్నా ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన పెరగడం లేదు. ఒక రకంగా పాలపిట్ట అన్నదాతకు కూడా మంచి నేస్తం. పొలాలకు హానిచేసే మిడతలను, పురుగులను తినే ఈ పక్షి, రైతులకు ఎంతో మేలు చేస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ అరుదైన, మన రాష్ట్ర పక్షిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరమున్నదని అంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement