అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులయ్యే వస్తున్నామని స్పష్టం
జమ్మికుంట, వీణవంక, కమలాపూర్‌లో భారీ చేరికలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో పార్టీలోకి..
జమ్మికుంటరూరల్/ జమ్మికుంట/ వీణవంక/ కమలాపూర్/ ఇల్లందకుంట, అక్టోబర్ 14 : సకలజనం కదులుతున్నది.. పండుగపూటా టీఆర్ఎస్ బాట పడుతున్నది. ‘కారుకే మా ఓటు’ అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, అదే జోష్‌తో గులాబీ పార్టీలో చేరుతున్నది. గురువారం జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లో వేర్వేరుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కు మార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు, పోచంపల్లి సమక్షంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే పార్టీలో చేరినట్లు ప్రకటించారు.
దళిత వ్యతిరేకి ఈటల: ఎమ్మెల్సీ నారదాసు
దళితుల ఆర్థికాభివృద్ధి కోసం దళిత బంధు తీసుకువచ్చి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడైతే.. దళిత బంధుకు అడ్డుపడుతూ ఈటల దళిత వ్యతిరేకిగా మిగిలిపోయారని ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు విమర్శించారు. గురువారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన 50 మంది కులపెద్దలు, యువకులు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరగా, కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ నారదాసు మాట్లాడుతూ ధరలు పెంచే పార్టీలో చేరిన రాజేందర్ ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు గ్యాస్ ధరల మీద పన్ను రూపంలో 291 తీసుకుంటున్నదని బూటకపు మాటలు మాట్లాడుతున్నారని, దమ్ముంటే నిరూపించాలని లేదంటే పోటీ నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరి రెండ్రోజులైనా స్పందించలేదని, ఆయన మాటల్లో నిజం ఉంటే వచ్చేవారు కదా..? అని పేర్కొన్నారు. ఈటల ఓటమి భయంతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి గెల్లు శ్రీనును గెలిపించాలని కోరారు. ఇక్కడ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ రాధారపు రాంచందర్, నాయకులు ఐలవేన సదానందం, ఐలవేన శ్రీనివాస్, మరో 30 మంది ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.
కుట్రలను తిప్పికొట్టాలి: ఎమ్మెల్యే చల్లా
బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలను యువత తిప్పికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కమలాపూర్ మండలం గూడూరులో బీజేపీకి చెందిన బండి అఖిల్, బండి శ్రీనివాస్, కుమ్మరి కృష్ణబాబు, కుమ్మరి కృష్ణ, రామంచ రాజు, కుమ్మరి అఖిల్, రాజేశ్, హారీశ్, తెప్ప రజనీకాంత్, కుమ్మరి జగన్, నవీన్, శ్రీకాంత్, గణేశ్ మరో 50మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ యువతను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీ చేసే కుట్రలను యువకులు ఖండించాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. అనంతరం గ్రామంలోని దుర్గాదేవిని దర్శించుకున్నారు. ఇక్కడి మండల ఇన్చార్జి పేరియాల రవీందర్రావు, సర్పంచ్ అంకతి సాంబయ్య ఉన్నారు.
పథకాలే శ్రీరామ రక్ష: ఎమ్మెల్సీ పోచంపల్లి
సంక్షేమ పథకాలే టీఆర్ఎస్కు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. జమ్మికుంట మండలం నగురం గ్రామ బీజేపీ నాయకులు బుర్ర సతీశ్, రాచమల్ల శివ, రవితోపాటు ఇరవై మంది కార్యకర్తలు వైస్ ఎంపీపీ పోల్సాని తిరుపతిరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీలో చేరిన ప్రతి నాయకున్ని, కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ నాయకులు మల్లారెడ్డి తదితరులున్నారు.
వినోద్ సమక్షంలో వంద మంది చేరిక
ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సమక్షంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం, కొత్తపల్లిలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నుంచి వంద మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అంతకుముందు జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి నివాసంలో ఉప ఎన్నికలు, పార్టీ అనుసరించాల్సిన విధానాలపై నాయకులతో చర్చించారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నాయకులు వాసాల రామస్వామి, రాజ్‌కుమార్, శ్రీనివాస్, మల్లయ్య, హుస్సేన్ పాల్గొన్నారు. అలాగే, ఇల్లందకుంట మండల కేంద్రంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజేపీ నుంచి మాజీ వార్డు సభ్యుడు రావుల రాజేందర్ టీఆర్ఎస్లో చేరారు.