
కూరగాయల సాగులో రాణిస్తున్న కౌలు రైతు
మూడెకరాల్లో బీర, 1.10 ఎకరాల్లో టమాట, మిగతా కాకర, మిర్చి సాగు
దండిగా దిగుబడులు
ఆరునెలల్లోనే మూడింతల ఆదాయం
ఆదర్శంగా నిలుస్తున్న పలుమారి రమేశ్
గంగాధర, డిసెంబర్ 13 : ఎవుసం అందరూ చేస్తారు. కానీ కాస్త వినూత్నంగా.. ఒక ఆలోచనతో ఎవరైతే ముందుకుసాగుతారో వారే లాభాలు సాధిస్తారు. నలుగురిలో ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వైవిధ్య సేద్యమే చేస్తూ కూరగాయల సాగులో జగిత్యాలకు చెందిన యువరైతు పలుమారి రమేశ్ సిరుల పంట పండిస్తున్నాడు. గంగాధర మండలం బూరుగుపల్లిలో ఐదెకరాలు కౌలుకు తీసుకొని టమాట, బీర, కాకర, మిర్చి వేస్తూ ఆరునెలల్లోనే 6లక్షలకు పైగా ఆదాయాన్ని పొందాడు. ఇంకా తన స్వగ్రామం ఐతుపల్లిలోని సొంత భూమిలో అల్లం, ఉల్లి సాగు బాటపట్టి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
పలుమారి రమేశ్ అలియాస్ సత్తయ్యది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి. ఎవుసం అంటే చాలా ఇష్టం. ఓ వైపు సొంతూరులో సాగు చేస్తూనే.. మరోవైపు గంగాధర మండలం బూరుగుపల్లిలో ఐదెకరాల భూమిని గత ఏప్రిల్‌లో కౌలుకు తీసుకున్నాడు. అందరిలా వరి, పత్తి కాకుండా సరికొత్తగా ముందుకు‘సాగా’లని నిర్ణయించుకున్నాడు. అనంతపూర్ జిల్లా మదనపల్లి రైతులు ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తారని, అక్కడి నుంచే హైదరాబాద్‌కు వేల టన్నుల్లో వెజ్టేబుల్స్ వస్తుంటాయని తెలుసుకున్నాడు. అక్కడి రైతుల మాదిరిగా తాను కూడా కూరగాయలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా అనంతపురం జిల్లా మదనపల్లిలో, కడప జిల్లా మైదకూరు, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో రైతులు సాగు చేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించి, వివరాలు తెలుసుకుని సాగుకు శ్రీకారం చుట్టాడు.
పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ
రమేశ్ తాను కౌలుకు తీసుకున్న భూమిలో పూర్తిగా కూరగాయలే సాగు చేశాడు. 3 ఎకరాల్లో బీర, 50 గుంటల్లో టమాట, 20 గుంటల్లో కాకర, 10 గుంటల్లో చిక్కుడు సాగు చేశాడు. అయితే మొదటి ఆరునెలల్లో బీరకాయల ద్వారా 3.50లక్షలు, టమాట ద్వారా 2.50 లక్షలు, కాకర ద్వారా 50 వేలు, చిక్కుడు ద్వారా 10 వేలు లాభం వచ్చింది. ప్రస్తుతం మరో రెండెకరాల్లో టమాట, సాగు చేస్తున్నట్లు రమేశ్ తెలిపాడు. మొత్తంగా తొలి ఆరునెలల్లో దాదాపు 6.50లక్షల ఆదాయం వచ్చింది. అయితే కౌలు భూమిలో సాగు చేస్తున్నందున రమేశ్‌కు పెట్టుబడి ఖర్చులు ఎక్కువగానే అయ్యాయి. పంట తొలిసారి కాబట్టి భూమిని చదును చేయించేందుకు 45 వేలు, మొక్కలకు నీరు అందించడానికి డ్రిప్ కోసం 1.50లక్షలు అదనంగా వెచ్చించాడు. ఇక పెట్టుబడి విషయానికి వస్తే మల్చింగ్ కోసం 60 వేలు, కర్రల కోసం 50 వేలు, దారాల కోసం 15వేలు, కూరగాయల విత్తనాలకు 30 వేలు వ్యయం చేశాడు. మొత్తంగా అన్ని పెట్టుబడులు పోను 3లక్షల నికర లాభం పొందాడు. కాగా, రమేశ్ తన స్వగ్రామం పెగడపల్లి మండలం ఐతుపల్లిలోని తన సొంత భూమి రెండెకరాల్లో అల్లం, ఉల్లి సాగు చేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం అల్లం పిలకదశలో ఉన్నట్లు, ఉల్లిగడ్డ ఇప్పుడిప్పుడే మొలకవస్తున్నట్లు తెలిపాడు.
కలెక్టర్ అభినందన
వరికి బదులుగా వినూత్న రీతిలో కూరగాయలు సాగు చేస్తున్న రమేశ్ పంట క్షేత్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సందర్శించారు. రమేశ్ పండించిన టమాట, కాకర, అల్లం, ఉల్లిగడ్డ పంటలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూసపద్ధతిలో కాకుండా కొత్త రకంగా ఆలోచన చేసి కూరగాయలు సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుండడంతో పాటు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రమేశ్‌ను కలెక్టర్ అభినందించారు. ఇతర పంటల సాగుపై గ్రామాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో రమేశ్ వంటి రైతులను ఉదాహరణగా చూపాలని సూచించారు.
మంచి లాభం ఉంది..
వరి కంటే కూరగాయల సాగుతో మంచి లాభాలుంటయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నష్టం వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎకరంలో టమాట సాగు చేస్తే మూడు వేల బాక్సులు వస్తుంది, కనీసం రెండు వేల బాక్సులు వచ్చినా కిలో 12 పడినా ఎకరానికి 3.50లక్షలు వస్తోంది. ఖర్చులు 1.50లక్షలు పోయినా 2 లక్షల లాభం మిగులుతోంది. వరి సాగు చేస్తే ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల వడ్లు మాత్రమే వస్తాయి. ఖర్చులు దాదాపు 25 వేల దాకా ఉండి లాభం తక్కువగా ఉంటుంది. వరి కోసింది మొదలు పంట డబ్బులు చేతికి వచ్చే దాకా రైతులు తిప్పలు పడుడే. అదే కూరగాయలైతే మార్కెట్‌కు తీసుకువెళ్లిన వెంటనే కొనుగోలు చేసిన వారు అక్కడికక్కడే డబ్బులు చెల్లిస్తారు. ఏ రంది ఉండది.