మర పట్టించిన నూనెకు భలే గిరాకీ..
కల్తీ ఆయిల్‌తో ప్రజల భయాందోళన
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ధర ఎక్కువైనా కొనుగోలు
విరివిగా వెలుస్తున్న యంత్రాలు
వేరుశనగ లీటర్ నూనె రూ. 350
సన్‌ఫ్లవర్ నూనె లీటర్‌కు రూ. 400
నువ్వులు, కొబ్బరి నూనెలు లీటర్ రూ. 500
మార్కెట్లో విచ్చలవిడిగా కల్తీ నూనెలు రాజ్యమేలుతున్న నేపథ్యంలో మళ్లీ గానుగ నూనెకు డిమాండ్ పెరుగుతున్నది. మార్కెట్లో కల్తీ నూనెలు విక్రయిస్తున్నారన్న ప్రచారంతో ప్రజలు జంకుతున్నారు. ఏ కంపెనీ నూనె నాణ్యమైనదో.. ఏది కల్తీ అవుతుందో తెలియక తికమకపడుతున్నారు. ఈ క్రమంలో గానుగ నూనె కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలకేంద్రాల్లో సైతం గానుగ యంత్రాలు విరివిగా వెలుస్తున్నాయి. గానుగ నూనెకు మంచి డిమాండ్ ఉండడంతో యువత కూడా ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నది. గానుగ పద్ధతి పాతదే అయినా ఇదే నాణ్యమైనదని భావించి ప్రజలు ఆ నూనె వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో పట్టణాల నుంచి పల్లెల వరకు గానుగ నూనె వాడకం పెరుగుతున్నది. వినియోగదారుడు విత్తనాలు ఇస్తే నిర్వాహకులు మరాడించి నూనె తీసి ఇస్తున్నారు. యంత్రాలు నడిపే యజమానులు సైతం వారి వద్ద ఉన్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి అందుబాటులో ఉంచుకొని అప్పటికప్పుడు పట్టించి ఇస్తున్నారు. కళ్లముందే మరాడించిన ఆయిల్ ఎలాంటి కల్తీ లేకుండా ఇస్తుండడంతో మంచి డిమాండ్ ఉంటున్నది. పిండి గిర్నీలు నడిపే నిర్వాహకుల్లో ఎక్కువ మంది గానుగ యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. రైతుల వద్ద నాణ్యమైన వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలను కొనుగోలు చేసి గానుగ పట్టిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న వివిధ కంపెనీల నూనెల ధర లీటర్‌కు రూ. 90 నుంచి రూ. 160వరకు ఉన్నది. మార్కెట్లోని నూనె ధరలతో పోలిస్తే గానుగ నూనె ధర ఎక్కువైనప్పటికీ కొనేందుకు వెనుకడుగు ప్రజలు వేయడం లేదు. ఈ వ్యాపారం రెండు విధాలుగా సాగుతున్నది. వినియోగదారులే కిలో గింజలు తెచ్చి గానుగ పట్టించుకుంటే కేవలం రూ. 25 తీసుకుంటున్నారు. అదే గింజలు గానుగ యంత్ర నిర్వాహకులవైతే వేరుశనగ నూనె లీటరుకు రూ. 350, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్‌కు రూ. 400, నువ్వులు, కొబ్బరి లీటర్‌కు రూ. 500 ధర ఉంది.
గింజ ధరలు.. నూనె ధరలు
గానుగ ద్వారా వేరుశనగ, సన్‌ఫ్లవర్, కొబ్బరి, నువ్వుల నూనెలను విక్రయిస్తున్నారు. వేరు శనగ కిలో రూ. 100-120, సన్‌ఫ్లవర్ గింజలు కిలో రూ. 60-70, నువ్వులు 140-150, కురిడి కొబ్బరి రూ. 240, మామూలు కొబ్బరి రూ. 160 ధర పలుకుతున్నాయి. ఇందులో వేటిని గానుగ చేసినా 15కిలోలు చేస్తే 5లీటర్ల నూనె వస్తుంది. 5 లీటర్ల ఆయిల్ తీయాలంటే గంట, గంటన్నర సమయం పడుతుంది. ఇలా గానుగ చేసిన వేరుశనగ నూనె లీటర్‌కు రూ. 350కు, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్‌కు రూ. 400గా, నువ్వులు, కొబ్బరి నూనెలు కిలో రూ. 50కు విక్రయిస్తున్నారు.
గానుగ వ్యర్థాలతో పల్లి పిండి(పల్లి చెక్క)..
వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్ గింజలు, కొబ్బరిని మరాడించడం ద్వారా కిందికి ఆయిల్ వస్తుండగా పైన ఉండే వ్యర్థాలు పశువులకు దాణాగా ఉపయోగపడుతున్నాయి. పల్లి పిండి(పల్లి చెక్క)ను పాడి రైతులు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ పల్లి పిండి ధర కిలో రూ. 30గా విక్రయిస్తున్నారు.
రెగ్యులర్ కస్టమర్లు వస్తుంటారు
ఒక్కసారి గానుగ నూనె వాడిన కుటుంబం ఆ తర్వాత బయటి కంపెనీల నూనెలు వాడడం లేదు. కస్టమర్లు రెగ్యులర్‌గా గానుగ నూనె కోసం వస్తున్నారు. అందరూ ఈ నూనె వాడడం మొదలు పెడితే వాడకోటి పెట్టినా గానుగ నూనె సరిపోదు. అంత గిరాకీ ఉంటుంది. ప్రజల్లో మంచి చైతన్యం ఉంది ఒకరిని చూసి మరొకరు వచ్చి నూనె కొనుగోలు చేస్తున్నారు.