దళితులు పెద్దసంఖ్యలో హాజరుకావాలి
ఇన్చార్జిలకు ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పిలుపు
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 13 : ఈ నెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో జరిగే సీఎం సభకు భారీగా తరలివచ్చి దళితబంధు సభను జయప్రదం చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని సింగాపురం గ్రామంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం దేశంలోనే ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదన్నారు. ఇది ఎంతో గొప్ప పథకమని, దీన్ని శాలపల్లిలో సీఎం కేసీఆర్ ప్రారంభించడానికి రావడం శుభపరిణామని పేర్కొన్నారు. ఈ సభకు లక్ష మందికి పైగా వస్తారని, మండలం నుంచి 20వేల మందిని తీసుకురావాలని పేర్కొన్నారు. హుజూరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్కు మెజార్టీ ఓట్లు తేవాలని కోరారు. టీఆర్ఎస్ చేపట్టిన పథకాలు ప్రతి గడపకూ చేర్చాలన్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమనేత గెల్లు శ్రీనివాస్‌కు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. బీసీ బిడ్డ గెల్లుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. హుజూరాబాద్ మండలం నుంచి గ్రామానికి వేయి మందికిపైగా ఈ నెల 16న శాలపల్లిలో జరిగే దళిత బంధు సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోషన్రావు, జడ్పీటీసీ పడిదం బకారెడ్డి, ఎంపీపీ రాణి సురేందర్‌రెడ్డి, నాయకులు సంగెం ఐలయ్య, ఎడవెల్లి కొండల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, కేతిరి రాజా ప్రతాపరెడ్డి, కన్నవేని శ్రీనివాస్, దాసరి రమణారెడ్డి, మొలుగురి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.