రోజురోజుకూ పెరుగుతున్న ఇమ్మతి
ఊరూరా జై కొడుతున్న సంఘాలు, నాయకులు
పెద్దపాపయ్యపల్లిలో ముదిరాజ్ కులస్తుల ఏకగ్రీవ తీర్మానం
మంత్రి గంగుల సమక్షంలో 100 మంది చేరిక
హుజూరాబాద్‌లో రెడ్డి సంఘాల బాసట
హుజూరాబాద్ రూరల్/హుజూరాబాద్ చౌరస్తా, ఆగస్టు 13: టీఆర్ఎస్కు బలం పెరుగుతున్నది. సకలజనం మద్దతు పలుకుతున్నది. ‘టీఆర్ఎస్తోనే ఉంటాం.. కేసీఆరే మా నాయకుడు అంటూ’ జైకొడుతున్నది. ఓవైపు చేరికలు.. మరోవైపు ఏకగ్రీవ తీర్మానాలతో పార్టీలో నూతనోత్తేజం కనిపిస్తున్నది. శుక్రవారం పెద్దపాపయ్యపల్లికి చెందిన ముదిరాజ్ కులస్తులు పార్టీకి మద్దతు పలికారు. ఏకగ్రీవ తీర్మానం చేసి, తీర్మాన ప్రతిని సింగాపూర్ గ్రామంలో మంత్రి గంగుల కమలాకర్‌కు అందజేశారు. అలాగే దాదాపు వంద మంది ముదిరాజ్ కులస్తులు పార్టీలో చేరారు.
మత్స్యకారులకు అండగా సర్కారు: మంత్రి గంగుల
మత్స్యకారులకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, ఆయన నాయకత్వంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు కొండాల్‌రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గట్టు పద్దయ్య, సంఘం నాయకులు భిక్షపతి, కొమురయ్య, చిన్న రాజయ్య, రామయ్య, భద్రయ్య ఉన్నారు.
టీఆర్ఎస్కే రెడ్డి సంఘాల మద్దతు..
రాబోయే ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలోని రెడ్డి సంక్షేమ సంఘాలు టీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తాయని హుజూరాబాద్ సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండారెడ్డి, ఎంపీపీ ఇరుమల్ల రాణి, సురేందర్‌రెడ్డి, రెడ్డి సంఘాల నేత, మాజీ కౌన్సిలర్ పోరెడ్డి శంతన్‌రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని సిటీ సెంటర్‌హాల్‌లో శుక్రవారం జరిగిన రెడ్డి సంఘాల సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. కాకతీయ కెనాల్ వద్ద రెడ్డి సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి స్థలంతో పాటు రూ.కోటి నిధులను ప్రభుత్వం మంజూరు చేయడంపై కొండాల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.