
అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి
మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షకు విశేష స్పందన
కమాన్చౌరస్తా, డిసెంబర్ 12: అతి చిన్న వయసులో గణిత శాస్త్రంలో పలు సంసరణలను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి శ్రీనివాస రామానుజన్ అని, ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వావిలాలపల్లి అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ, రామానుజన్ గణిత శాస్త్రంలో అనేక విషయాలను రూపొందించారని, వాటి ద్వారా గణితశాస్త్రాన్ని సులభంగా నేర్చుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3420 మంది పదో తరగతి విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.