16 నుంచే దళిత బంధు చెక్కులు
మంత్రి కొప్పుల ఈశ్వర్
శాలపల్లిలో మంత్రులతో కలిసి ఏర్పాట్ల పరిశీలన
హుజురాబాద్‌రూరల్, ఆగస్టు 12: విప్లవాత్మక దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సభకు 1.20లక్షల మంది హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. గురువారం సభా ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌తో కలిసి పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలోనే గొప్ప పథకాన్ని ప్రారంభించేందుకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు.. సభను దిగ్విజయం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. దళితులు హాజరయ్యేందుకు 825 బస్సులు సిద్ధం చేశామని, అలాగే వారికి మంచినీళ్లు, భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చూడాలని పోలీసులకు సూచించారు.
సభలో 2వేల మందికి చెక్కులు..
దళిత బంధు ప్రారంభోత్సవ సభలో 2వేల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున చెకులు అందజేస్తామని, ఆ మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలోని అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు అందిస్తామని వివరించారు. ఇందుకు సంబంధించి సీఎం రూ.2వేల కోట్లు ప్రకటించారని, రూ.500కోట్ల విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగులకు తప్ప దాదాపు అన్ని కుటుంబాలకు అందిస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు తదితరులున్నారు.