గన్నేరువరం, జనవరి12 : మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి గన్నేరువరం, ఖాసింపేట, పారువెళ్ల, మాదాపూర్ గ్రామాల్లో రైతులు సాగు చేసిన పొద్దు తిరుగుడు, మక్కజొన్న పంటలు నేల కొరిగాయి. బుధవారం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి సర్పంచులు, రైతు బంధు సమితి సభ్యులతో కలిసి పంట నష్టాన్ని అంచనా వేశారు. ప్రాధమిక అంచనా ప్రకారం 92 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ఏవో తెలిపారు. ఇక్కడ రైతు బంధుసమితి మండల కోఆర్డినేటర్ బద్ధం తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి, ఏఈవో అనూష ఉన్నారు.
కరీంనగర్ రూరల్ మండలంలో..
కరీంనగర్ రూరల్, జనవరి 12: మంగళవారం రాత్రి కురిసి వడగళ్ల వానకు కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్, దుర్శేడ్, నల్లగుంటపల్లి, చెర్లభూత్కూర్, చేగుర్తి, నగునూర్‌లో పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యవసాయాధికారి సత్యం దుర్శేడ్, గోపాల్ఫూర్, చేగుర్తి గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు నమోదు చేశారు. గోపాల్‌పూర్‌లో ఎర్ర అజయ్య, ఎకరం 20 గుంటలు, ఎర్ర శ్రీనివాస్ ఎకరం, ఎర్ర మల్లయ్య 20 గుంటలు, ఎర్ర రమేశ్ ఎకరం 20 గుంటలు, నాగిరెడ్డి హనుమ రెండెకరాల 12 గుంటల్లో మక్కజొన్న పంటకు నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. 8 ఎకరాల్లో పాలకూర, మూడెకరాల్లో తోటకూర, గోంగూర, 10 ఎకరాల్లో టమాట, బెండ, మిర్చి, పూదిన పంటలకు నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేగుర్తిలో ఎర్ర అంజయ్య రెండెకరాల 12 గుంటల్లో వేసిన మక్కజొన్న పంటకు నష్టం కలిగిందని వ్యవసాయ అధికారి సత్యం తెలిపారు. దుర్శేడ్‌లో అంజయ్యకు చెందిన మక్కజొన్నకు నష్టం కలిగిందన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వే నిర్వహించి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందిస్తారని తెలిపారు.
వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు
మానకొండూర్ రూరల్ (శంకరపట్నం), జనవరి 12: శంకరపట్నం మండల కేంద్రంతో పాటు మండలంలోని కరీంపేట, ఇప్పలపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం కురిసిన వడగండ్లవానతో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పలపల్లిలో మక్కజొన్న పంట నేలకొరగగా, కరీంపేటలో టమాట పంటలు దెబ్బతిన్నాయి. మండల కేంద్రంలోని రైస్‌మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయినట్లు రైస్‌మిల్లుల యజమానులు తెలిపారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను సర్వే చేసి ఆదుకోవాలని రైస్‌మిల్లర్లు, రైతులు కోరుతున్నారు.