రెండు భాగాలుగా పట్టణ ప్రధాన రహదారి విస్తరణ చేపడుతాం
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
వేములవాడ, డిసెంబర్ 11: మొదటి బైపాస్ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బైపాస్ రహదారి పనుల్లో సాంకేతిక సమస్యల వల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ వేగంగా పూర్తి చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని చెప్పారు. చెక్కపల్లి రహదారిలో రూ.2కోట్లతో వంతెన, రహదారి నిర్మించామని, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు త్వరలో నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. సమీకృత మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులను రెండు భాగాలు చేసి చేపడుతామని తెలిపారు. మూలవాగు వంతెన నుంచి పోలీసు స్టేషన్ వరకు రహదారి విస్తరణ ఉంటుందని చెప్పారు. ఇటీవల మంజూరైన రూ.20కోట్ల నిధులతో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రూ.42 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు పూర్తికావస్తుండగా, రెండో వంతెన నిర్మాణం మొదలైందని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, రోడ్లు భవనాల శాఖ డీఈ శాంతయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు ఇప్పపూల అజయ్, మారం కుమార్, నరాల శేఖర్, కోఆప్షన్ సభ్యుడు బాబున్, సెస్ మాజీ డైరెక్టర్ రామతీర్థపు రాజు, నాయకులు కందుల క్రాంతి, కొండ కనకయ్య, పొలాస నరేందర్ తదితరులున్నారు.