కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) అడ్డాగా అంబులెన్స్‌ల దందా జోరుగా సాగుతున్నది. అత్యవసర సమయాల్లో చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చిన పేషెంట్లను కమీషన్ల కోసం ప్రైవేట్ దవాఖానలకు తరలిస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. అయితే, కొంతమంది 108 సిబ్బంది ఈ దందాను వ్యతిరేకిస్తున్నా.. మరికొంత మంది సిబ్బంది మాత్రం కాసుల కక్కుర్తితో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులకు సహకరిస్తున్నట్టు తెలుస్తున్నది. క్షతగాత్రులను అర్హత లేని హాస్పిటళ్లకు తరలించి ప్రాణాల మీదకు తెస్తున్నారనే విమర్శలు వస్తుండగా, దీనిపై జీజీహెచ్అధికారులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో దందా అడ్డూఅదుపు లేకుండా పోతున్నది.
కరీంనగర్, మార్చి 27 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ప్రస్తుత మంచిర్యాల, కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఏకైక పెద్ద దవాఖాన కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్). ఇక్కడికి నిత్యం వేలాది మంది పేషెంట్లు వస్తుంటారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా.. ఇతరత్రా ప్రాణాపాయ స్థితిలో అయినా పేషెంట్లను ఘటనా స్థలం నుంచి 108 వాహనాల్లో ఇక్కడికి చేరుస్తుంటారు. అయితే, ఇదే అదునుగా ప్రైవేట్ దవాఖానల నెట్వర్క్ దందా వెలుగు చూస్తున్నది. పేషెంట్ జీజీహెచ్‌కు రావడమే ఆలస్యం.. ఈ దవాఖాన చుట్టూ మోహరించి ఉన్న ఏదో ఒక ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు వెంటనే తమ వాహనంలో పేషెంట్‌ను మార్చుకొని ప్రైవేట్ దవాఖానలకు తరలించడం నిత్యకృత్యంగా మారింది.
ఇదంతా ఒక నెట్వర్క్ సిస్టంలో జరుగుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు, 108 సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ఆర్ఎంపీలకు కమీషన్లు ముడుతున్నట్టు తెలుస్తుండగా, దవాఖానలో పనిచేసే కొందరు వైద్యులు, సిబ్బందిపైనా ఆరోపణలు వస్తున్నాయి. మొదట ఘటన జరిగినప్పుడు ఆర్ఎంపీ, పీఎంపీలు జనరల్ హాస్పిటల్ ముందు తమకు అనుకూలంగా ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులకు ఫోన్లు చేసి చెప్పడం, ఆ తర్వాత వాళ్లు జీజీహెచ్ నుంచి ప్రైవేట్ దవాఖానలకు తరలించి రూ.వేలకు వేలు కమీషన్లు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో కొంతమంది 108 సిబ్బంది పాత్ర ప్రధానంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఘటనా స్థలం నుంచి పేషెంట్లను తీసుకొస్తున్న క్రమంలోనే ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులకు సమాచారం అందిస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే, ఈ దందా ఇష్టం లేని కొందరు 108 పైలెట్స్, టెక్నికల్ సిబ్బంది మాత్రం ప్రైవేట్ అంబులెన్స్‌ల నిర్వాహకులను ఎదిరించి, నిబంధనల ప్రకారం జనరల్ హాస్పిటల్లోనే జాయిన్ చేయిస్తున్నారు. అయితే, ఆ తర్వాత కూడా కొన్ని ప్రైవేట్ దవాఖానల నెట్వర్క్ సిబ్బంది క్షతగాత్రులను ఏదో విధంగా మోటివెట్ చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయమై ఇప్పటికే మూడుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అధికారులు చెబుతున్నా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్లో 16 , జగిత్యాలలో 15, సిరిసిల్లలో 12, పెద్దపల్లిలో 10 అంబులెన్స్(108) వాహనాలు సేవలందిస్తున్నాయి. ఒక్క కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు రోజుకు 35 నుంచి 50 కేసులు 108 ద్వారా వస్తున్నాయి. సగటున 40 కేసులు ఉంటున్నాయి. ఈ జీజీహెచ్‌లో న్యూరో, కార్డియాలజీ మినహా ఆర్థో, ఫిజీషియన్, గైనిక్ విభాగాలు బాగానే పని చేస్తున్నాయి. అయితే, ఆర్థో విభాగం పటిష్టంగా ఉన్నా ప్రాథమిక చికిత్స చేసి వరంగల్‌కు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాళ్లు, చేతులు ఇతర శరీర భాగాల్లో ఎక్కడ గాయాలైనా చికిత్స అందించే సదుపాయం ఉంది.
కానీ, రోజుకు సగటున 20 మందిని ఇతర ప్రభుత్వ దవాఖానలకు రెఫర్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో క్షతగాత్రులు అంత దూరం వెళ్లలేక కరీంనగర్‌లోని ఏదో ఒక ప్రైవేట్ దవాఖానకు వెళ్లాల్సి వస్తున్నది. ఇదే సమయంలో ప్రైవేట్ అంబులెన్స్‌ల నిర్వాహకులు క్షతగాత్రులను తరలించే విషయంలో గొడవలకు దిగుతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి 108 సిబ్బంది క్షతగాత్రులను జనరల్ హాస్పిటల్‌కు తరలించిన తర్వాత ఇక్కడే అడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది.
కొందరిని అడ్మిట్ చేసుకోకుండా ప్రాథమిక చికిత్సలాంటిది చేసి రెఫర్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇలా చేయడం వల్ల క్షతగాత్రులు ఉన్న కొద్ది విలువైన సమయం వృథా అయి ప్రాణాల మీదికి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇక్కడే ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితిని కల్పిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే, ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేని ఒక ప్రైవేట్ దవాఖానకే ఎక్కువ మంది క్షతగాత్రులను తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. నిజానికి జీజీహెచ్‌లో సీటీ స్కాన్ సదుపాయం లేదు. తలకు గాయాలైన వారిని ఇతర ప్రభుత్వ దవాఖానలకు రెఫర్ చేయడంలో అర్థం ఉంటుందిగానీ, ఆర్థో కేసులను కూడా రెఫర్ చేయడం చూస్తే వైద్యులు చికిత్స అందించ లేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ, పీఆర్వోలతో పాటు సిబ్బందితో ప్రైవేట్ అంబులెన్స్ సిబ్బంది రోజూ గొడవలకు దిగుతూ పేషెంట్లను ప్రైవేట్ దవాఖానలకు తరలిస్తున్నారు. దీనిపై ఇప్పటికే నాకు ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది అంబులెన్స్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయినా, వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మూడు రోజుల కిందట 108లో వచ్చిన పేషెంట్‌ను బలవంతంగా ప్రైవేట్ అంబులెన్స్‌లో ప్రైవేట్ దవాఖానకు తరలించారు. దీనిపై సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాను.
– గుండా వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ (కరీంనగర్)
ఈ దందాలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు, 108 సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ఆర్ఎంపీలు.. ఇలా అందరికీ కమీషన్లు ముడుతున్నట్టు తెలుస్తున్నది. విచిత్రం ఏమిటంటే కమీషన్ల కోసం జీజీహెచ్‌లో పనిచేసే కొందరు వైద్యులు కూడా పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌కు పేషెంట్లను పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తీరా రిపోర్టులు చూసి ఇక్కడ సదుపాయాలు లేవని, వేరే దవాఖానలకు వెళ్లాలని సిఫారసు చేస్తున్నట్టు సమాచారం. లబోదిబోమంటున్న క్షతగాత్రులు, రోగులు తప్పనిపరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానలకు వెళ్తున్నారు.
ముఖ్యంగా ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ డ్రైవర్లు చిన్న చిన్న ప్రైవేట్ దవాఖానాల్లో చేర్పిస్తున్నారు. అక్కడ వైద్య సదుపాయాలు లేక ప్రాణాల మీదికి వస్తున్నది. ఇటీవల సుల్తానాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా, సరైన చికిత్స అందక ముగ్గురు మృతి చెందారనే ఆరోపణలున్నాయి. క్షతగాత్రుల ప్రాణాలు ఏమైతే మాకేం.. మా కమీషన్ మాకు వస్తే చాలనే రీతిలో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జనరల్ హాస్పిటల్ అధికారులు, పోలీసులు చొరవ తీసుకుని ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.