రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంటలోని 11, 17 వార్డుల్లో దళితబంధుపై అవగాహన సదస్సు
జమ్మికుంట, అక్టోబర్ 9: బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు రూ.550 కోట్లు ఉంటే.. పేదింటిలో పుట్టిన నాకు రెండు గుంటల భూమి మాత్రమే ఉంది. ఐదేళ్లు ప్రజలకు సేవ చేయాలని ఓటు వేసి గెలిపిస్తే ఈటల రాజేందర్ తన స్వార్థం కోసం, అక్రమాస్తులను కాపాడుకొనేందుకే రాజీనామా చేసి బీజేపీలో చేరిండు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కే గోరీ కడుతానంటున్నడు. ఇది పద్ధతేనా? మంత్రిగా ఒక్క పని చేయలేనోడు రేపు ఎమ్మెల్యేగా ఏంచేస్తడు. అభివృద్ధిని మరిచిన ఆయనకు ఈ ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలి. బీజేపీ ధరలు పెంచుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ పెట్టుబడిదారులకు అండగా నిలుస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిని పని చేసినందుకు సీఎం కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చారు. నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ తీసుకురావడానికి కృషి చేస్త. రూ.వెయ్యి కోట్లతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్త. మీకు అండగా ఉండి సేవ చేస్త.
దళితబంధుతో దళితుల బతుకులు మారుతాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 11వ వార్డులో కౌన్సిలర్ బిట్ల కళావతి-మోహన్, 17వ వార్డులో కౌన్సిలర్ జూగురి సదానందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళితబంధు అవగాహన సదస్సులో మంత్రితోపాటు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడారు. దళితబంధు దళితుల అభ్యున్నతికి తోడ్పడుతుందన్నారు. ఈ పథకంపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. డివిజన్ ముఖ్యనాయకులు, ఇన్చార్జిలు కోట యాదగిరి, దామోదర్‌యాదవ్ పాల్గొన్నారు.
ఈటల పెద్ద అవకాశవాది
ఈటల రాజేందర్ పెద్ద అవకాశవాదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఒక్కరే దళిత జాతిని ఉద్ధరిస్తున్నరని, దళితబంధుతో దళితుల జీవితాలు మారుతాయని తెలిపారు. శనివారం ఆయన ఆబాది జమ్మికుంటలోని దళితకాలనీలో పర్యటించారు. దళితలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇష్టాగోష్టి చేశారు. దళితబంధుపై బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. టీఆర్ఎస్లో పదవులన్నీ అనుభవించిన ఈటల రాజీనామా చేసి మళ్లీ అదే పదవికి ఎందుకు పోటీ చేస్తున్నారో? చెప్పాలన్నారు. దళితులకు బీజేపీ వ్యతిరేకమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేదాకా ఇక్కడే ఉంటానని, సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పారు. మంత్రిగా ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే ఓటెయ్యాలని, అభ్యర్థి గెల్లు సీనునే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్ సుగుణ, నాయకులు, దళితులు పాల్గొన్నారు.