ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
కలెక్టర్ ఖాతాలో నిధులు జమ
16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకం అధికారికంగా ప్రారంభం
దళితుల హర్షాతిరేకాలు
వాడవాడనా హోరెత్తిన సంబురాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు
కరీంనగర్ ప్రతినిధి/ కరీంనగర్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : దళిత బంధు అమలుకు అడుగుపడింది. హుజూరాబాద్ గడ్డ దళిత బిడ్డలకు పండుగ వచ్చింది. పథకం కోసం ఏకంగా 500 కోట్లు విడుదల చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెను వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మేరకు తొలివిడుత ఐదు వేల కుటుంబాలకు ఏకకాలంలో లబ్ధి చేకూరనున్నది. ఈ నిధుల విషయం తెలుసుకున్న దళిత బిడ్డలు హుజూరాబాద్ గడ్డపై దరహాసంతో దరువేశారు. ‘మా దేవుడు నువ్వేనయ్యా’ ‘కష్టాలు తీర్చే నాయకుడు కేసీఆరే’ అంటూ నినదించారు. స్వీట్లు పంచుకొని, పటాకులు కాల్చి, సంబురాలు చేసుకున్నారు.
దళితుల దశాదిశ మార్చే దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 16న హుజూరాబాద్ గడ్డపై అధికారికంగా ప్రారంభం కానున్న విషయం విదితమే. ఇక్కడ లక్ష మందితో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ పథకానికి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆధ్వర్యంలో పథకం అమలుకు కావాల్సిన అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారు. హుజూరాబాద్‌లో దళిత కుటుంబాల సంఖ్య 20,929 ఉండగా, సర్వే దాదాపు పూర్తయింది. అందుకు సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి చేరాయి.
500 కోట్లు విడుదల..
చెప్పింది చెప్పినట్లుగా పథకాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ పథకాన్ని అడ్డుకోవాలని కొంత మంది కుట్రలు చేస్తున్నా.. ఆ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం సోమవారం 500 కోట్లను రాష్ట్ర కార్పొరేషన్‌కు విడుదల చేస్తూ జీవోనంబర్ 114ను విడుదల చేసింది. ఆ వెంటనే సదరు 500 కోట్లను కలెక్టర్ ఖాతాకు బదిలీ చేస్తూ.. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో సదరు నిధులు కరీంనగర్ కలెక్టర్ ఖాతాలోకి వచ్చి చేరాయి. సాధారణంగా ఏ పథకమైనా ప్రారంభం తర్వాత నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ, దళిత బంధు పథకానికి మాత్రం సీఎం ముందుగానే నిధులు విడుదల చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ముఖ్యమంత్రి దళితులపై చూపుతున్న ప్రేమకు ఈ నిధుల విడుదలే సాక్షమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వెల్లువెత్తిన సంబురాలు..
నిధులు విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో హోరెత్తించారు. జమ్మికుంట గాంధీ చౌరస్తాలో నిర్వహించిన సంబురాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, కోరుకంటి చందర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపళ్లి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. స్థానిక దళితులతో కలిసి పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఇల్లందకుంటలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, సర్పంచ్‌లు రఫీఖాన్, రజిత, ఎంపీటీసీలు సంజీవరెడ్డి, విజయ, రమ, టీఆర్ఎస్ నాయకులు బుర్ర రమేశ్, ముస్తాఫా, వీరారెడ్డి, గణపతి, తారక్‌తో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. డప్పు కొడుతూ ఎమ్మెల్యే ఉత్సాహం నింపారు. హుజూరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక దళితులు సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని ఇందిరానగర్‌కాలనీలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, నినాదాలతో హోరెత్తించారు. వీణవంక మండలం దేశాయిపల్లి క్రాస్ రోడ్డు వద్ద నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో దళిత సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. హుజూరాబాద్ మండలం కందుగులలో జడ్పీటీసీ పడదం బక్కారెడ్డి అద్వర్యంలో అంబేద్కర్, కేసీఅర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ, దళితులంతా టీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
దళితుడినైనందుకు గర్వపడుతున్న..
గతంలో దళితుడంటే అందరికీ చిన్నచూపు ఉండేది. కానీ, ఇప్పుడు సీఎం కేసీఆర్ కల్పిస్తున్న ప్రాధాన్యతకు దళితుడనైనందుకు గర్వపడుతున్న. మా దళితుల కోసం కేసీఆర్ 10లక్షల స్కీం పెట్టిండు. నేను పేయింటర్గా పనిచేస్త. ఇండ్లకు రంగులు వేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుకున్న. మాకు ఇద్దరు పిల్లలు. మా కుటుంబం నా ఒక్కడి కష్టార్జితంతో బతకాలంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు దళిత బంధు కింద కేసీఆర్ సాయం చేస్త అన్నడు. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసి ఆ రుణాన్ని కొంతైనా తీర్చుకుంటం.