మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంటలో మంత్రి ఆధ్వర్యంలో దళితుల సంబురాలు
పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జమ్మికుంట, ఆగస్టు 9: దళిత బంధు ఒక స్కీం కాదని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన ఒక ఉద్యమమని, చరిత్రలో ఇది గొప్ప కార్యక్రమంగా నిలుస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. దేశ ప్రజలందరూ మరోసారి తెలంగాణ వైపు చూస్తున్నరని, నిన్నటి దాకా అవాకులు చవాకులు పేలిన బీజేపీ, కాంగ్రెస్ నాయకుల ఎటుపోయారని, పాపం నోట మాట వస్తలేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో దళిత బంధు పథకానికి రూ.500 కోట్లు విడుదల చేయడంపై మంత్రి ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో దళితులు పెద్ద సంఖ్యలో సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి, పటాకులు కాల్చారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్, జైజై టీఆర్ఎస్’ అంటూ నినదించారు. హూజూరాబాద్ నియోజకవర్గంలో పథకాన్ని అమలుచేసేందుకు రూ.500 కోట్లు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ప్రజల నుంచి కనీస మద్దతు లేదని, దళితులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వాళ్లు కేసీఆర్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈనెల 16న జమ్మికుంటలో జరిగే కేసీఆర్ సభకు తరలివచ్చి జయప్రదం చేయాల్సిందిగా దళితులకు కొప్పుల పిలుపునిచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపనేని నరేందర్, ఎంపీ వెంకటేశ్, జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, మాజీ ఛైర్మన్ రామస్వామి, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, రవీందర్ పాల్గొన్నారు.
బీజేపీకి ఓటెందుకు వేయాలి..
వడ్లు కొనవద్దు అని, కల్లాలు ఎత్తి వేయాలని రాష్ట్రంపై ఒత్తిడి తేవడం, వ్యవసాయంలో చాటుమాటుగా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీకి ఓటు వేస్తారా అని మంత్రి కొప్పుల ప్రశ్నించారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని రామన్నపల్లెలో, 23, 30వ వార్డుల్లో పర్యటించారు. డ్రైనేజీలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామన్నపల్లెలోని హనుమాన్ ఆలయం అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.25లక్షలు ప్రభుత్వం కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతోనే గ్రామాల అభివృద్ధి కుంటు పడిందన్నారు. రామన్నపల్లెను సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. జమ్మికుంట పట్టణంలో రూ.35కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని, సీఎం కేసీఆర్ మరో రూ.15కోట్లు కూడా మంజూరు చేశారని చెప్పారు. వచ్చే ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఇక్కడ ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్, మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వర్‌రావు, మాజీ చైర్మన్ రామస్వామి, కౌన్సిలర్లు మల్లయ్య, లావణ్య, రవీందర్, నాయకులు పొనగంటి మల్లయ్య, పోల్నేని సత్యనారాయణరావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఉన్నారు.